పాకిస్తాన్ క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిష్టను కోల్పోతుందా..? అనిపించే ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఇంగ్లాండ్‌లో జరగనున్న ‘ది హండ్రెడ్’ క్రికెట్ లీగ్ కోసం జరిగిన డ్రాఫ్ట్‌లో 50 మంది పాక్ ఆటగాళ్లు పాల్గొనగా, ఒక్కరు మాత్రమే అమ్ముడయ్యారు. ఇది పాక్ క్రికెట్‌కు తీవ్ర పరాభవాన్ని తెచ్చిపెట్టింది. పురుషుల విభాగంలో ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, సైమ్ అయూబ్ వంటి స్టార్ క్రికెటర్లకు కూడా ఎవరూ ఆసక్తి చూపలేదు. అదే విధంగా, మహిళల విభాగంలో అలియా రియాజ్, ఫాతిమా సనా, యుస్రా అమీర్, ఇరామ్ జావేద్, జవేరియా రౌఫ్ వంటి ఆటగాళ్లు కూడా వదిలిపెట్టబడ్డారు.
తాజా డ్రాఫ్ట్‌లో నసీమ్ షా మాత్రమే అత్యధిక ధరకు అమ్ముడుపోగా, మిగిలిన ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు. ఇది పాకిస్తాన్ క్రికెట్ స్థితిగతులను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఈ సందర్భంలో పాక్ క్రికెట్ అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగానే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆర్థికంగా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో, దేశీయ క్రికెట్లోని ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను భారీగా తగ్గించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. రాబోయే నేషనల్ T20 ఛాంపియన్షిప్ కోసం, ప్రతి మ్యాచ్‌కు క్రికెటర్లకు ఇస్తున్న ఫీజును ₹1,00,000 నుంచి ₹10,000కి తగ్గించారు. రిజర్వ్ ప్లేయర్లకు అయితే కేవలం ₹5,000 మాత్రమే ఇస్తున్నారు.
అంతేకాకుండా, గత సీజన్‌లోని పెండింగ్ చెల్లింపులు ఇంకా పూర్తిగా విడుదల చేయకపోవడం, ఆటగాళ్లలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ఒకప్పుడు లగ్జరీ హోటళ్లలో ఉండే క్రికెటర్లను ఇప్పుడు సాధారణ వసతులకే పరిమితం చేశారు. అంతేకాదు, విమాన ప్రయాణ సౌకర్యాలను కూడా తగ్గించేశారు.
ఒకప్పటి పాక్ క్రికెట్ గౌరవాన్ని, ఇప్పుడు అంతర్జాతీయ లీగ్‌లలో ఆసక్తి తగ్గడం, PCB ఆర్థిక పరిస్థితి పడిపోవడం వంటివి మసకబారుస్తున్నాయి. ఇతర దేశాల ఆటగాళ్లకు హండ్రెడ్ లీగ్‌లో మంచి అవకాశాలు దక్కగా, పాకిస్తాన్ ఆటగాళ్లకు మాత్రం నిరాశే ఎదురైంది. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టులో చేరగా, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ సదరన్ బ్రేవ్ కోసం ఆడనున్నాడు. అలాగే, డేవిడ్ వార్నర్ లాంటి స్టార్ క్రికెటర్లను లండన్ స్పిరిట్ తమ జట్టులోకి తీసుకుంది.
ఈ పరిణామాలు పాక్ క్రికెట్ భవిష్యత్తుపై ప్రశ్నల దండకాన్ని రేపుతున్నాయి. పాక్ ఆటగాళ్లు అంతర్జాతీయ వేదికపై మళ్లీ పూర్వ వైభవాన్ని చాటుకుంటారా? లేక పాక్ క్రికెట్ క్రమంగా అంధకారంలోకి జారిపోతుందా? అన్నది కాలమే నిర్ణయించాలి!