భారత చెస్ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం రాసుకుంది. తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. జార్జియాలో జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌లో ఆమె తన అద్భుత వ్యూహాలు, పట్టుదలతో దేశానికే గర్వకారణంగా నిలిచింది.
క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కోనేరు హంపి 1.5-0.5 పాయింట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. మొదటి గేమ్‌లో తెల్లపావులతో అద్భుత ఆటతీరును ప్రదర్శించి గెలిచిన హంపి, రెండో గేమ్‌లో డ్రా చేసి సెమీఫైనల్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రతి కదలికలో ఆమె చూపిన అనుభవం, వ్యూహాత్మక ఆలోచన విజయానికి కీలకంగా నిలిచాయి.
Let’s cheer for our Telugu daughter shining brightly on the global stage.
Congratulations to Grandmaster Koneru Humpy on becoming the first Indian woman to reach the FIDE World Cup semifinals.
Your achievement fills us with pride and inspires countless others across the nation.… pic.twitter.com/JSDtzI7dv5
— N Chandrababu Naidu (@ncbn) July 21, 2025
కోనేరు హంపి ఈ అద్భుత విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా అనేక మంది ప్రముఖులు హంపికి శుభాకాంక్షలు తెలియజేశారు. “వరల్డ్ కప్ సెమీఫైనల్లో చేరిన తొలి భారతీయ మహిళగా కోనేరు హంపి చరిత్ర సృష్టించింది. ఇది తెలుగు ప్రజలందరికీ గర్వకారణం” అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేయగా, చంద్రబాబు నాయుడు “మన తెలుగు కుమార్తె ప్రపంచ వేదికపై కాంతులు విరజిమ్ముతోంది. నీ ఘనత దేశవ్యాప్తంగా మమ్మల్ని గర్వించేలా చేస్తోంది” అని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో 1987లో జన్మించిన కోనేరు హంపి ఐదేళ్ల వయసులోనే తన తండ్రి కోనేరు అశోక్ నుంచి చదరంగం నేర్చుకుంది. 2002లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన ఆమె, 2019, 2024లో మహిళల వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచింది. అనేక అంతర్జాతీయ టైటిళ్లను గెలుచుకున్న హంపి, భారత మహిళా చెస్‌కు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు సెమీఫైనల్లో ఆమె విజయంపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.