కేఎల్ రాహుల్, అతియా శెట్టి దంపతులకు పండంటి ఆడబిడ్డ.. సినీ, క్రీడా రంగం నుండి శుభాకాంక్షల వెల్లువ..!

భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి దంపతుల ఇంట ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. మార్చి 24, సోమవారం రోజున అతియా శెట్టి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రాహుల్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించగా, దీంతో క్రికెట్, సినీ ప్రపంచం నుంచి శుభాకాంక్షల వెల్లువ పోటెత్తుతోంది. అభిమానులు, సహచర క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు వారి కుటుంబానికి అభినందనలు తెలియజేస్తున్నారు.

కేఎల్ రాహుల్ మరియు అతియా శెట్టి 2023లో ప్రేమికుల నుంచి జీవిత భాగస్వాములుగా మారారు. వీరి పెళ్లి బాలీవుడ్, క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా నిలిచింది. 2024 నవంబర్ 8న అతియా శెట్టి తాను గర్భవతిగా ఉన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించగా, అప్పటినుండే అభిమానులు, కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూశారు. చివరికి, మంగళవారం ఉదయం కేఎల్ రాహుల్ తన పాప జన్మించిన శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.

ఈ సంతోషకరమైన సందర్భంగా ప్రముఖులు, సహచర క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వీరికి శుభాకాంక్షలు తెలిపారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, అనుష్క శర్మ, సునీల్ శెట్టి, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖులు ఈ నూతన తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు.

ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. అయితే, ఈ సంతోషకరమైన సందర్భంలో కుటుంబానికి సమయం కేటాయించేందుకు నిన్న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌కు అతను దూరంగా ఉన్నాడు. గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన రాహుల్‌ను ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది.

తల్లిదండ్రులుగా మారిన కేఎల్ రాహుల్, అతియా శెట్టికి అభిమానులు, కుటుంబసభ్యులు, మిత్రులు అశేష శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Leave a Reply