RCB VS PBKS: ఫైనల్స్‌కు చేరేది ఎవరు? క్వాలిఫయర్ 1లో ఈరోజు బెంగళూరు vs పంజాబ్

ఐపీఎల్ 18వ సీజన్‌లో లీగ్ దశ ముగిసింది. టాప్ 4 జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా, అసలైన పోరు ఇప్పుడు మొదలైంది. ఈరోజు జరుగనున్న క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది.

ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్‌ గెలవలేకపోయిన బెంగళూరు, పంజాబ్ జట్లు ఈ సారి మాత్రం అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సీజన్‌లో రెగ్యులర్ లీగ్ దశలో నిలకడగా ఆడిన ఈ రెండు జట్లు టేబుల్ టాప్‌లో నిలిచాయి. ఒక్కో జట్టు తొమ్మిది మ్యాచ్‌లను గెలిచింది, అయితే పంజాబ్‌కు మెరుగైన నెట్ రన్ రేట్ ఉండటంతో టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీజన్ చివర్లో మళ్లీ పుంజుకుంది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో అదరగొడుతున్నాడు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ పవర్‌ప్లేలో చెలరేగుతున్నాడు. జితేశ్ శర్మ మిడిలార్డర్‌లో మంచి హిట్టింగ్ చేస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో హేజిల్‌వుడ్, భువనేశ్వర్, యశ్ దయాళ్, షెపర్డ్‌లు పేస్ బాధ్యతలు పంచుకుంటుండగా, స్పిన్‌లో కృనాల్ పాండ్యా, సుయశ్ కీలకంగా మారారు. లీగ్ దశలో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం సాధించిన సంగతి ప్లే ఆఫ్స్‌లో మళ్లీ ప్రోత్సాహకరంగా మారవచ్చు.

గతంలో కోల్‌కతాకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ ఈసారి పంజాబ్‌కు గెలుపు బాట పట్టిస్తున్నాడు. 2014 తర్వాత తొలిసారిగా ప్లే ఆఫ్స్‌కి చేరిన పంజాబ్ జట్టు శ్రేయస్ నాయకత్వంలో చక్కటి ప్రదర్శన ఇస్తోంది. బ్యాటింగ్ విభాగంలో పియాంశ్ ఆర్య, ప్రభ్ మన్ సింగ్, ఇంగ్లిస్, శశాంక్ సింగ్ హై స్కోరింగ్ ఇన్నింగ్స్‌లతో మెరుస్తున్నారు.

అయితే బౌలింగ్‌లో మాత్రం పంజాబ్ బలహీనంగా కనిపిస్తోంది. ముఖ్య బౌలర్ మార్కో యాన్సెన్ దూరమవడం జట్టుకు దెబ్బ తగిలినా, చాహల్ తిరిగి వస్తే ఆ లోటు కొంత మేర తీరే అవకాశం ఉంది. ప్రస్తుతం అర్షదీప్ సింగ్‌ మాత్రమే స్పెషలిస్టుగా నిలుస్తున్నాడు.

ఈరోజు జరిగే ఈ క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి చేరుతుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2లో తలపడాల్సి ఉంటుంది.

Leave a Reply