RR vs LSG: IPLలో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. కావాలనే ఓడిన రాజస్థాన్ రాయల్స్?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఏప్రిల్ 19న జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఉద్దేశపూర్వకంగానే ఓడిందని, ఇదంతా ప్లాన్‌ ప్రకారమే జరిగిందని ఆరోపిస్తూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA) అడ్ హాక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో వెంటనే విచారణ జరపాలని అధికారులను డిమాండ్ చేశారు.

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రాజస్థాన్ బలంగా పోటీ ఇచ్చినట్టు కనిపించింది. ఒక దశలో మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లోనే ఉందని అందరూ అనుకున్నారు. కానీ చివరి ఓవర్లలో ఆటతీరు పూర్తిగా మారిపోవడంతో అభిమానులు, విశ్లేషకులు ఆశ్చర్యానికి గురయ్యారు. తక్కువ స్కోర్ చేజ్ చేసే సమయంలో సుదీర్ఘ గ్యాప్‌లు, ఔటయ్యేలా షాట్లు ఆడటం వంటి దృశ్యాలు అనుమానాలకు తావిస్తున్నాయి.

బిహానీ ఇంతకుముందు నుంచి రాజస్థాన్ రాయల్స్‌ పట్ల విమర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన చెప్పినట్టు, “రాష్ట్రంలో క్రికెట్ పోటీలు పక్కాగా జరిగేలా చూసేందుకు ప్రభుత్వం తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసింది. కానీ ఐపీఎల్ విషయంలో మాత్రం మా సూచనలేవీ పట్టించుకోవడం లేదు. మ్యాచ్‌లు తమ ఇష్టానుసారం నడుస్తున్నాయి.”

ఇక స్పోర్ట్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలనూ బిహానీ ప్రశ్నిస్తూ, ఐపీఎల్ వ్యవహారాల నుంచి తాత్కాలిక కమిటీని పక్కనపెట్టడమే ఈ సమస్యలకు కారణమవుతుందని అభిప్రాయపడ్డాడు.

ఈ వార్త ఐపీఎల్ అభిమానుల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు నిజమేనా? లేక ఇది అంతర్గత విభేదాల ఫలితమా? ఈ వ్యవహారం మరింత క్షుణ్నంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply