జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. 26 మంది పర్యాటకులు దుర్మరణం పాలవగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా, క్రీడా ప్రపంచం కూడా స్పందిస్తోంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి గౌరవంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి.
SRH vs MI మ్యాచ్‌లో BCCI కీలక నిర్ణయం
ఉగ్రదాడి నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో జరగనున్న IPL 2025 41వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు నల్ల బ్యాండ్‌లు ధరించనున్నాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక నిమిషం మౌనం పాటించి మృతులకు నివాళులర్పించనున్నారు. చీర్‌లీడర్స్ ప్రదర్శనలను రద్దు చేయడమే కాకుండా.. మ్యాచ్ తర్వాత జరగాల్సిన బాణసంచా వేడుకలు కూడా రద్దయ్యాయి.
మళ్లీ మైదానంలోకి హైదరాబాద్.. పాయింట్ల కోసం పోరు
ఏప్రిల్ 17న వాంఖడేలో ముంబై చేతిలో ఓటమి అనంతరం దాదాపు వారం రోజులకు పైగా విరామం తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలే సాధించగలిగిన హైదరాబాద్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దిగువన ఉంది. ముంబై చేతిలో గతంలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈసారి హోం గ్రౌండ్ పై ఆశలు పెట్టుకుంది.
ముంబై మోమెంటమ్‌తో ముందుకు..
మరోవైపు, ముంబై ఇండియన్స్ గట్టిగా తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. గత మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించింది. హైదరాబాద్‌ను ఓడించి ప్లే ఆఫ్ రేసులో మరింత ముందుకు వెళ్లాలనే దృక్పథంతో ముంబై జట్టు బరిలోకి దిగుతోంది.