India vs Pakistan : భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

ఆసియా కప్‌లో భారత్ పాక్‌తో ఆడుతుందా? లేక బహిష్కరిస్తుందా? అన్న ప్రశ్నతో క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదన్న డిమాండ్ మరింత బలపడింది. అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా మ్యాచ్‌ను బహిష్కరించాలంటూ స్వరం వినిపించారు. “దేశం కంటే ఒక్క మ్యాచ్ పెద్దది కాదు” అని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో భారత్-పాక్ పోరుపై సందిగ్ధం నెలకొంది. అయితే, ఈ అంశం ఆటగాళ్ల చేతుల్లోనో, బీసీసీఐ చేతుల్లోనో లేదని స్పష్టమైంది. ప్రభుత్వ నిర్ణయాన్నే బీసీసీఐ పాటించాల్సి ఉంటుంది. చివరికి కేంద్రం పాక్‌తో ఆసియా కప్ మ్యాచ్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్టీ నేషనల్ ఈవెంట్లను అడ్డుకోమని క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో సెప్టెంబర్ 14న భారత్-పాక్ తలపడటం ఖాయమైంది.

అయితే, పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లకు మాత్రం భారత్ తిరస్కారం తెలిపింది. 2012-13లో చివరిసారిగా ఇరు జట్ల మధ్య సిరీస్ జరిగింది. అప్పటి నుంచి భారత్-పాక్ జట్లు కేవలం ఆసియా కప్, ఐసీసీ ఈవెంట్లలోనే తలపడుతున్నాయి. ఇకపై కూడా ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవని స్పష్టంచేసింది.

క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది:

భారత్ జట్లు పాకిస్తాన్‌కు వెళ్లవు

భారత్‌లో ఆడేందుకు పాక్ జట్లకు అనుమతి ఉండదు

మల్టీ నేషనల్, అంతర్జాతీయ ఈవెంట్లలో మాత్రం భారత్ పాల్గొంటుంది

భారత్ ఆతిథ్యమిచ్చే ఈవెంట్లలో పాక్ అథ్లెట్లు, జట్లు కూడా పాల్గొనొచ్చు

అలాగే, అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ల నిర్వహణలో భారత్ ప్రాధాన్య గమ్యస్థానంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ స్పోర్ట్స్ బాడీకి చెందిన ఆటగాళ్లు, అధికారులకు వీసా ప్రక్రియను సరళీకరించనున్నట్లు కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Leave a Reply