Asia Cup 2025: ఇండియా-బంగ్లాదేశ్ సూపర్-4 క్లాష్.. ఫైనల్స్ కోసం కీలక మ్యాచ్..!

క్రికెట్‌లో టీమ్ ఇండియా ప్రస్తుతం అన్‌బీటబుల్ ఫార్మ్‌లో ఉంది. ముఖ్యంగా టీ20ల్లో భారత జట్టు అప్రతిహతంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో కూడా టీమ్ ఇండియాకు ఎదురు లేదు. ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌లలో గెలిచింది. పాకిస్తాన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌లు కూడా సులభంగా గెలిచింది.. కేవలం మాటల యుద్ధం మాత్రమే జరిగింది.

ఈరోజు సూపర్-4‌లో భారత్ బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. ఇరు జట్ల బలాబలాలు చూస్తే, బంగ్లా కూడా పటిష్టమైన జట్టే, కానీ టీమ్ ఇండియా ఇంకా పటిష్టంగా ఉంది. ఆసియా కప్‌లో భారత్ తర్వాత బలమైన జట్టు బంగ్లాదేశ్. ఇటీవల బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకను కూడా మట్టికరిపించింది.

భారత్ జట్టు అన్ని రకాల సామర్థ్యాలతో ముందుకు వెళుతుంది. బ్యాటింగ్ లైన్ అద్భుతంగా ఉంది. ఓపెనర్ అభిషేక్ శర్మ విరుచుకుపడుతూ, ఇప్పటికే 200 పై స్ట్రైక్ రేట్‌తో 173 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. అతని తర్వాత గిల్, కెప్టెన్ స్కై, తిలక్ వర్మ, శివమ్ దూబే, సంజూ శాంసన్ అందరూ బాగా ఆడుతున్నారు. గిల్ కూడా లాస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై దెబ్బ కొట్టాడు, ఆసియా కప్‌లో అతని స్ట్రైక్ రేట్ 158 గా ఉంది.

బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. శివమ్ దూబే, వరుణ్, కుల్‌దీప్, అక్షర్ లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. అయితే ఫీల్డింగ్‌లో కొంచెం మెరుగుదల అవసరం ఉంది. పాక్‌తో మ్యాచ్‌లో మూడు క్యాచ్‌లు వదిలారు, ఈసారి అలాంటి తప్పులు చేయకూడదు.

బంగ్లాదేశ్ బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ చాటా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. అతని బౌలింగ్ భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లకు సవాలు. శ్రీలంకపై అతను 20 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

అయితే బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైన్ మాత్రం కాస్త వీక్. లిటన్ దాస్, హృదోయ్ లు బాగా ఆడకపోతే జట్టు మొత్తం కుప్పకూలే అవకాశం ఉంది. స్లో పిచ్‌పై ముస్తాఫిజుర్, స్పిన్నర్లు రిషాద్, మెహదీ హసన్ బలంగా బౌలింగ్ చేస్తే టీమ్ ఇండియాకు సవాలు అవుతుంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ గెలిచే అవకాశం ఎక్కువ.

Leave a Reply