India Vs Pakistan : భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు 50% తగ్గించినా కొనట్లేదు..!

సాధారణంగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లకు టికెట్ల కోసం అభిమానులు క్యూలు కడతారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు ఇప్పటికీ అమ్ముడుపోలేదు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు టికెట్ ధరలను భారీగా తగ్గించినా, అమ్మకాలు మాత్రం మందగిస్తున్నాయి.

గతంలో భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు కొన్ని గంటల్లోనే హాట్‌కేక్‌లా అమ్ముడయ్యేవి. కానీ ఇప్పుడు పహల్గాం దాడి ప్రభావం, అభిమానుల్లో పాకిస్థాన్‌తో ఆడకూడదన్న ఆగ్రహం కారణంగా టికెట్లకు డిమాండ్ తగ్గింది. అలాగే అధిక ధరలు కూడా మరో కారణంగా నిలిచాయి.

దీంతో రూ. 5000గా ఉన్న టికెట్ ధరను రూ. 2500కి తగ్గించారు. ఇతర కేటగిరీ ధరలను కూడా సగానికి తగ్గించినా, స్పందన పెద్దగా లేకపోవడం నిర్వాహకులను షాక్‌కు గురిచేస్తోంది. అయితే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు మాత్రం టికెట్లు అమ్ముడవడం లేదన్న వార్తలను ఖండిస్తోంది. “అన్ని పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి. టికెట్లు అమ్ముడవడం లేదు అన్నది వాస్తవం కాదు” అని స్పష్టంచేసింది.

ఇక 2025లో దుబాయ్‌లో భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ జరగడం ఇది రెండోసారి. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా నాలుగు నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడైన సంగతి తెలిసిందే. ఈసారికి మాత్రం అభిమానుల నిరసన, డిప్లమాటిక్ సంబంధాల ప్రభావం కారణంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. బీసీసీఐపై కూడా రెండు దేశాల మధ్య పరిస్థితులు మెరుగుపడే వరకు మ్యాచ్‌లు ఆడకూడదని హర్భజన్ సింగ్ లాంటి మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Leave a Reply