Divya Deshmukh: చెస్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్‌కు భారీ ప్రైజ్‌మనీ.. ఎంతో తెలిస్తే షాకవుతారు!

19 ఏళ్ల భారత యువ చెస్ సంచలనం దివ్య దేశ్‌ముఖ్ (Divya Deshmukh) 2025 ఫిడే మహిళల ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించారు. ఈ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనతను అందుకున్నారు. ఈ విజయంతో ఆమె నాలుగో భారతీయ మహిళా గ్రాండ్‌మాస్టర్‌గాను, మొత్తం 88వ భారత గ్రాండ్‌మాస్టర్‌గానూ నిలిచారు.

ఈ విజయంలో ప్రత్యేకత ఏమిటంటే.. దివ్య తన సీనియర్, భారత చెస్ లెజెండ్ కోనేరు హంపిని ఫైనల్లో ఓడించింది. జార్జియాలోని బటూమిలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో రెండు క్లాసికల్ గేమ్స్ డ్రా కావడంతో టైబ్రేక్‌కి వెళ్లింది. టైబ్రేక్‌ గేమ్స్‌లో దివ్య తన మానసిక స్థైర్యాన్ని చాటుతూ 1.5-0.5 స్కోరుతో ఘన విజయం సాధించింది.

దివ్యకు ఈ విజయం ద్వారా భారీ ప్రైజ్‌మనీగా $50,000 (భారత కరెన్సీలో సుమారు రూ.41.6 లక్షలు) లభించనుంది. అంతేకాదు, గ్రాండ్‌మాస్టర్ (GM) టైటిల్ కూడా స్వయంచాలకంగా లభించింది. మరోవైపు రన్నరప్‌గా నిలిచిన కోనేరు హంపికి $35,000 (సుమారు రూ.29.1 లక్షలు) ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు.

2025 ఫిడే మహిళల ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌పూల్ $691,250గా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని 107 మంది ప్లేయర్ల మధ్య వారి ప్రదర్శనను బట్టి విభజిస్తారు. మొదటి రౌండ్‌లో ఓడిన వారికి $3,750, క్వార్టర్‌ ఫైనల్స్ చేరిన వారికి $14,000 చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తుంది.

Leave a Reply