Ruturaj Gaikwad: CSK కెప్టెన్ గా మళ్లీ ధోని ఎంట్రీ: గాయంతో రుతురాజ్ గైక్వాడ్ IPL‌కు గుడ్‌బై..!

ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు మరో కష్ట కాలం ఎదురైంది. ఇప్పటికే వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న జట్టుకు ఇప్పుడు మరో బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ తీవ్రమైన గాయంతో టోర్నీ నుంచి పూర్తిగా నిష్క్రమించాడు. దీంతో, మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు ఎంఎస్ ధోనీ భుజాలపై పడింది.

చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ శుక్రవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, “గైక్వాడ్ ఎడమ మోచేయికి గాయం అయింది. ఫ్రాక్చర్ స్థాయిలో గాయపడడంతో వైద్యుల సూచనల మేరకు అతను మిగతా సీజన్‌లో పాల్గొనలేడు. ఇకముందు మిగిలిన మ్యాచ్‌లకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు,” అని స్పష్టంచేశారు.

ఈ గాయం గైక్వాడ్‌కి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో జరిగింది. మొదట్లో అది చిన్న గాయంగా భావించినప్పటికీ, స్కాన్ రిపోర్ట్స్‌లో ఫ్రాక్చర్ ఉన్నట్టు తేలింది. దీంతో CSK మేనేజ్‌మెంట్ అతనికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి, కొన్ని మ్యాచుల్లో బాగా రాణించినప్పటికీ జట్టు ప్రదర్శనలో నిలకడ కనిపించలేదు. ఈ తరుణంలో కెప్టెన్‌గా మళ్లీ ధోనిని తీసుకురావడం వెనుక స్పష్టమైన వ్యూహమే ఉన్నట్టు తెలుస్తోంది. జట్టును మళ్లీ గెలిచే మార్గంలో తీసుకెళ్లేందుకు ధోని అనుభవం కీలకంగా మారనుంది.

ఐపీఎల్ 18వ సీజన్‌లో ఇప్పటివరకు CSK నాలుగు పరాజయాలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో మిగతా మ్యాచ్‌లు చాలా కీలకం కానున్నాయి. కెప్టెన్ మార్పుతో జట్టులో ఎనర్జీ మారుతుందా? ధోని మ్యాజిక్ మరోసారి పని చేస్తుందా? అన్నదే అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.

Leave a Reply