Sourav Ganguly: భారత క్రికెట్‌ను ఎవరూ ఆపలేరు.. సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు

భారత క్రికెట్‌ను ఎవరూ ఆపలేరు.. దేశంలో ప్రతిభావంతులైన ఆటగాళ్ల ప్రవాహం ఎప్పటికీ ఆగదు అంటూ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “పాత నీరు పోతుంది.. కొత్త నీరు వస్తుంది. ఇది నిరంతరమైన ప్రక్రియ. స్టార్ ఆటగాళ్లు రిటైర్ అయినా, వారి స్థానాలను ప్రతిభావంతులైన యువత తక్షణమే భర్తీ చేస్తుంటారు” అని గంగూలీ వ్యాఖ్యానించారు.

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సీరీస్‌లో టీమ్ ఇండియా మంచి ప్రదర్శన చేసిన నేపథ్యంలో ఆయన ఈ మాటలు అన్నారు. ఐపీఎల్‌, భారత్ ఎ, అండర్-19 లాంటి వేదికల ద్వారా దేశానికి ప్రతిభావంతులైన క్రికెటర్లు అందుబాటులో ఉన్నారని.. భవిష్యత్తులోనూ ఎలాంటి డోకా అవసరం లేదన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ లాంటి స్టార్ ప్లేయర్లు రిటైర్ అయినా.. భారత క్రికెట్ నిలిచిపోదని, భారత జట్టు ప్రయాణం ఎప్పటికీ ముందుకు సాగుతుందన్నారు.

మాంచెస్టర్‌లో జరిగిన నాల్గవ టెస్ట్‌లో టీమ్ కొంత వెనుకబడినప్పటికీ ఐదవ టెస్ట్‌లో అద్భుతంగా తిరిగి నిలిచిందని గంగూలీ కొనియాడారు. శుభ్‌మన్ గిల్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ.. అనుభవం తక్కువ ఉన్నా, యువ ఆటగాళ్లు అందరిలా గొప్పగా ఆడారని అన్నారు. బ్యాటింగ్ విభాగంలో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, గిల్, పంత్, జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడగా.. బౌలింగ్ విభాగంలో సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ కృష్ణ ఆకట్టుకున్నారని చెప్పారు.

ఇక గంగూలీ తన గత అనుభవాన్ని గుర్తు చేస్తూ.. గవాస్కర్, కపిల్ దేవ్ తర్వాత సచిన్, ద్రావిడ్, సెహ్వాగ్ వంటి వారితో క్రికెట్ కొనసాగిందని.. ఇప్పుడు అదే విధంగా యువ ఆటగాళ్లు ముందుకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. “భారత క్రికెట్ ఎప్పటికీ నిలబడుతుంది.. దాన్ని ఎవరూ ఆపలేరు” అంటూ గంగూలీ స్పష్టం చేశారు.

Leave a Reply