BCCI: గంభీర్ సన్నిహితుడుతో పాటు నలుగురికి బీసీసీఐ గుడ్‌బై!

టీమిండియాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకొని జట్టులోని నలుగురు సహాయక సిబ్బందికి ఉద్వాసన పలికింది. వీరిలో గౌతమ్ గంభీర్ సన్నిహితుడు అభిషేక్ నాయర్ కూడా ఉన్నారు. జట్టులో అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్న అభిషేక్‌ను, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్, మసాజర్‌ను బీసీసీఐ తప్పించింది.

గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభిషేక్ నాయర్ 2024 జూలైలో అసిస్టెంట్ కోచ్‌గా నియమితులయ్యాడు. అయితే ఇటీవల ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్‌ పేలవంగా ఆడిన నేపథ్యంలో డ్రెస్సింగ్ రూమ్‌లోని అంతర్గత విషయాలు లీక్ కావడం, ఆ సిరీస్ ఆటతీరు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇక అభిషేక్ నాయర్ పదవీకాలం ముగియడంతోనే అతడిని తొలగించామని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఫీల్డింగ్, ఫిట్‌నెస్ విభాగాల్లో తీవ్ర అసంతృప్తితో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషణ.

ప్రస్తుతం టీమిండియా జట్టు జూన్ 20న ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు సిద్ధమవుతోంది. అందుకు ముందు కొత్త కోచింగ్ సిబ్బందిని నియమించనున్నట్లు సమాచారం. బీసీసీఐ ఈ నెల 20లోపు కొత్త సపోర్ట్ స్టాఫ్‌ను ఎంపిక చేస్తుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ పరిణామాలతో జట్టులో వాతావరణం మారనుందని, గంభీర్‌కి ఇది తొలి పరీక్ష అవుతుందని విశ్లేషకుల అభిప్రాయం.

Leave a Reply