Asia Cup 2025: పాకిస్తాన్ పై టీమ్ ఇండియా ఘన విజయం.. పహల్గాం దాడికి ప్రతీకారం!

ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ముందుగా టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులే చేసింది.

టాస్ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టుకు తొలి ఓవర్ నుంచే షాక్ ఎదురైంది. హార్దిక్ పాండ్యా వేసిన తొలి బంతికే సయిమ్ అయూబ్ (0) అవుట్ అయ్యాడు. త్వరలోనే మహ్మద్ హారిస్ (3) కూడా బుమ్రా బౌలింగ్‌లో హార్దిక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆరునిమిషాల్లోనే రెండు వికెట్లు కోల్పోయిన పాక్ ఇబ్బందుల్లో పడింది. ఫకర్ జమాన్ (17), సాహిబ్‌జాదా ఫర్హాన్ (3) కొంతసేపు ప్రయత్నించినా విఫలమయ్యారు. చివర్లో షాహీన్ అఫ్రిది 4 సిక్స్‌లు బాదడంతో స్కోరు 127కి చేరింది.

భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. బుమ్రా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ దక్కించుకున్నారు.

128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఆరంభంలో కొంత తడబడ్డా, ఆ తర్వాత మ్యాచ్‌ను సులభంగా గెలిచింది. ఓపెనర్ గిల్ కేవలం 10 పరుగుల దగ్గర అవుట్ అయ్యాడు. కొద్ది సేపటికే అభిషేక్ శర్మ (31) కూడా వెనుదిరిగాడు.

ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు ఇన్నింగ్స్‌ను బలపరిచారు. ఇద్దరూ వేగంగా రన్స్ చేస్తూ పాకిస్థాన్ బౌలర్లను కుదిపేశారు. తిలక్ వర్మ అవుట్ అయిన తర్వాత శివమ్ దూబే క్రీజులోకి వచ్చాడు. ఈ దశలో కెప్టెన్ స్కై మరింత దూకుడుగా ఆడి, చివర్లో సూపర్ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

భారత్ కేవలం 15 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్ కేవలం క్రీడ కాదు, పహల్గాం దాడికి టీమ్ ఇండియా ఇచ్చిన సమాధానంలా మారింది. మ్యాచ్ మొత్తం భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య దూరం స్పష్టంగా కనిపించింది. బీసీసీఐ ప్రతినిధులు కూడా మ్యాచ్‌కు రాకుండా ‘ఇన్విజిబుల్ బాయ్ కాట్’ కొనసాగించారు.

మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబేలు పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకుండా నేరుగా పోడియంకు వెళ్లారు. దీంతో ఈ విజయానికి మరింత రాజకీయ, భావోద్వేగ ప్రాధాన్యం దక్కింది.

Leave a Reply