బంగ్లాదేశ్‌పై ఘనవిజయం.. ఆసియా కప్ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన టీమ్ ఇండియా

ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్ స్టేడియంలో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘనవిజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై 41 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ఆధిపత్యం చలాయించింది.

భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లా జట్టులో ఓపెనర్ సైఫ్ హసన్ (69; 51 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులు) ఒంటరిగా పోరాడాడు. కానీ మరో ఎండ్‌లో వికెట్లు వరుసగా కోల్పోవడంతో జట్టు పూర్తిగా కుప్పకూలింది.

భారత బౌలర్లలో కుల్‌దీప్ 3 వికెట్లు, బుమ్రా 2, వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్, తిలక్ వర్మ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ ఫైనల్ టికెట్ ఖాయం చేసుకోగా, రెండు మ్యాచ్‌లు ఓడిన శ్రీలంక టోర్నీ నుంచి బయటపడింది. ఇక రేపు జరిగే పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో విజేత జట్టు సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్‌లో భారత్‌తో తలపడనుంది.

ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్ మంచి ఆరంభం ఇచ్చారు. ఇద్దరూ కలసి 77 పరుగులు జోడించారు. గిల్ (29) ఔటైన తర్వాత అభిషేక్ శర్మ దూకుడుగా ఆడి 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. చివరికి 75 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రనౌట్ అయ్యాడు. ఆయన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి.

Leave a Reply