అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణలో భారత్ మరో పెద్ద అడుగు వేసింది. 2030 కామన్వెల్త్ గేమ్స్‌ను ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ వేసిన బిడ్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్రీడాశాఖ తీసుకువచ్చిన ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన కేంద్రం, అహ్మదాబాద్‌ను ఈ గేమ్స్‌కు సరైన వేదికగా గుర్తించింది.
గత ఏడాది మార్చిలోనే భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు ఆసక్తి చూపుతూ కేంద్రానికి లేఖ పంపింది. అనంతరం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను వేదికగా ఖరారు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. కామన్వెల్త్ గేమ్స్ బిడ్ల దాఖలుకు ఆగస్టు 31 తుది గడువుగా నిర్ణయించగా, మరో 48 గంటల్లో IOA మొత్తం ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సమాచారం.
ఇంతకు ముందు 2010లో భారత్ ఆతిథ్యమిచ్చిన కామన్వెల్త్ గేమ్స్ విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ 2030 ఎడిషన్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. మరోవైపు, 2036 ఒలింపిక్స్ నిర్వహణకు కూడా భారత్ ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, దేశంలో 3 వేల మంది క్రీడాకారులకు నెలకు రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. 2036 ఒలింపిక్స్‌లో భారత్ టాప్ 5లో నిలవడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.