CM Revanth Reddy, Harish Rao: సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు భేటీ.. అసలు కారణమేంటి?

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో హరీష్ రావు, పద్మారావు గౌడ్, మల్లారెడ్డి ముఖ్యమంత్రిని కలిసి దాదాపు 15 నిమిషాల పాటు చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించడంపై వారు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ భేటీకి గంట ముందే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయగా, రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కానీ కొద్దిసేపటికే ఇద్దరు కలిసి ప్రొటోకాల్ సమస్యలపై చర్చించుకోవడం ఆసక్తిగా మారింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తరువాత, బీఆర్ఎస్ నేతలతో విభేదాలు మరింత తీవ్రంగా మారాయి. ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్‌లపై రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా పదేపదే విమర్శలు చేస్తున్నారు. అదే విధంగా, బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ పాలనను టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమావేశం జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే, నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించని అంశాన్ని హరీష్ రావు & ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డితో జరిగిన చర్చలో, ఆయన కూడా ఈ అంశంపై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో గట్టి పోటీ ఉన్నప్పటికీ, అభివృద్ధి మరియు ప్రజాసంక్షేమ అంశాల్లో అన్ని పార్టీలు కలిసి పనిచేయడం అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply