Pawan Kalyan: “భయం లేదు.. పోరాటం నడుస్తూనే ఉంటుంది! పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు”

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. “భయమన్నది లేనే లేదు!” అంటూ ఆయన తన ఉద్ఘాటిత అభిప్రాయాలను పంచుకున్నారు. పిఠాపురం చిత్రాడలో జరిగిన ఈ సభలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణం, టీడీపీతోకలసి అనుభవించిన ఒడిదుడుకులు, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు, తెలంగాణ ప్రజలతో తన అనుబంధం, భవిష్యత్తు లక్ష్యాలు వంటి కీలక అంశాలపై మాట్లాడారు.

జనసేన ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు తన పోరాట ప్రయాణం గురించి పవన్ మాట్లాడుతూ, “2014లో పార్టీని స్థాపించాం, ఆవేశం తో కాదు.. అవసరమై చేశాం. 2019లో ఓటమి భయం లేకుండా పోటీ చేశాం. ఓడినా వెనక్కి తగ్గలేదు. నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం. అంతేకాదు, నాలుగు దశాబ్దాలుగా ఉన్న టీడీపీని కూడా నిలబెట్టాం!” అంటూ పవన్ వ్యాఖ్యానించారు.

2019 ఎన్నికల్లో జనసేన పరాజయాన్ని వైసీపీ నేతలు కేవలం తమ ఘనతగా ప్రచారం చేసిన తీరు అసహ్యంగా మారిందని, కానీ ప్రజాస్వామ్యంలో ఎవ్వరూ శాశ్వతంగా గెలవరు, ఓడిపోరని అన్నారు.

పవన్ తన ప్రసంగంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, వైసీపీ దాడులు, అసెంబ్లీ దుర్వినియోగం గురించి తీవ్రంగా ప్రస్తావించారు.

“చంద్రబాబు లాంటి నాయకుడిని అకారణంగా జైలుకు పంపారు. నా మీద కూడా కుట్రలు చేశారు. అసెంబ్లీ గేటు దాటి లోపలికి అడుగు పెట్టనివ్వని వాళ్ల తొడలు బద్దలు కొట్టాం. జనసేన తల దించుకునే పార్టీ కాదు!” అంటూ పవన్ ధ్వజమెత్తారు.

2024 ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అఖండ విజయం సాధించి, వైసీపీ పాలనను ముగించామని పవన్ స్పష్టం చేశారు.

తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరింత హైలైట్ అయ్యాయి. “నా తెలంగాణ కోటి రతనాల వీణ! కొండగట్టు అంజన్న కటాక్షంతోనే నేను ప్రాణాలతో ఉన్నా. జనసేనకు తెలంగాణ జన్మభూమి.. ఆంధ్రప్రదేశ్ కర్మభూమి!” అంటూ జనసైనికుల మద్దతును పొందారు.

గద్దర్, తన కుటుంబం, సినిమాలు, మొదటి ప్రేమ రోజులు, తన మధ్యతరగతి జీవితాన్ని గుర్తుచేసుకుంటూ పవన్ సెంటిమెంటల్ స్పీచ్ ఇచ్చారు. ఆయన మాటల్లో తెలంగాణ ప్రజలపై ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపించింది.

హిందీలో ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ భారతదేశ ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం అనే అంశాలను ప్రస్తావించారు. “దేశం కోసం ఒకే విధానం ఉండాలి. భిన్న భాషల మధ్య సంఘీభావం అవసరం. భవిష్యత్తు తరాల కోసం మనం మిలిటరీలా సిద్ధంగా ఉండాలి!” అని అన్నారు.

పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్ర గురించి మాట్లాడుతూ, “దశాబ్దంపాటు పార్టీని నడిపించాలంటే ఎన్నో అవమానాలు భరించాలి, వ్యక్తిగత జీవితం కోల్పోవాలి. కానీ జనసేనను నిర్మాణాత్మక దిశలో తీసుకెళ్లేందుకు నేను సిద్ధం. ఇప్పుడు మీ అండతో మరోసారి బలంగా ముందుకు వెళ్లబోతున్నా!” అంటూ కార్యకర్తలకు ఉత్సాహం నింపారు.

“అల్లరి చిల్లర వాళ్లు నాకు అవసరం లేదు. నా వెంట నిలబడేవారు మిలిటరీలా ఉండాలి. మన లక్ష్యం 100% స్ట్రైక్ రేట్ సాధించాలి!” అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టమైన సందేశం ఇచ్చారు.

ఈ ప్రసంగంతో పవన్ కళ్యాణ్ తన లక్ష్యాన్ని స్పష్టంగా వెల్లడించారు – జనసేన ఇకపై మరింత దృఢంగా, పోరాట స్ఫూర్తితో, రాజకీయాల్లో కీలకమైన మార్పులకు దోహదం చేయబోతుందనే సంకేతాలు ఇచ్చారు.

Leave a Reply