Pawan Kalyan: జనసేన తమిళనాడులో అడుగుపెడుతుందా? పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!

జనసేన పార్టీ తమిళనాడులో అడుగుపెట్టే అవకాశాన్ని పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టంగా వెల్లడించారు. తాను ఏమీ ముందుగా ప్లాన్ చేసుకోలేదని, కానీ ప్రజల అభీష్టం ఉంటే, జనసేన తమిళనాడులోనూ రాజకీయంగా చురుకుగా వ్యవహరించేందుకు సిద్ధమని ఆయన తెలిపారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను పవన్ కళ్యాణ్ మంచి నాయకుడిగా ప్రశంసించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్టాలిన్ పగ తీర్చుకోవాలనే భావన లేకుండా పరిపాలన చేయడం ప్రశంసనీయమని చెప్పారు. రాజకీయాల్లో పార్టీని స్థాపించడం కంటే, దాన్ని నిలబెట్టుకోవడమే అసలైన సవాలు అని ఆయన అభిప్రాయపడ్డారు.

తమిళనాడులో సినీ నటులు రాజకీయాల్లోకి రావడం సులభం కాదని, అది కేవలం ఎన్టీఆర్ గారికే సాధ్యమైందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్టీఆర్ తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారని, అయితే అది అందరికీ సాధ్యపడే విషయం కాదన్నారు. రాజకీయాల్లో ఓపిక ఎంతో అవసరమని, సుదీర్ఘ ప్రయాణం చేయగలిగిన వారే విజయాన్ని అందుకోగలరని వ్యాఖ్యానించారు.

భారతదేశానికి భాషా విభజన అవసరం లేదని, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించే ఏ నిర్ణయానికీ తాను మద్దతు ఇవ్వబోనని పవన్ స్పష్టం చేశారు. ఒక భాషను బలవంతంగా రుద్దడం తగదని, నార్త్ ఇండియన్స్ కూడా దక్షిణాది భాషలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు.

ఎన్డీఏ కూటమిలో తిరిగి ఎఐఏడీఎంకే చేరితే అది సంతోషకరమని, మళ్లీ కలిసి పనిచేయడంలో ఎలాంటి తప్పు లేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఎఐఏడీఎంకే బలమైన పార్టీ అని, దాని ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వ సామర్థ్యం ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు.

తమిళనాడులో జనసేన రాజకీయంగా చురుకుగా ఉండాలా? అనే అంశం పూర్తిగా ప్రజల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల మద్దతు ఉంటే, పార్టీ అక్కడ ఎదగడానికి కూడా పోటీ పడుతుందని ఆయన తెలిపారు.

Leave a Reply