HYD: భాగ్యనగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం

HYD

HYD: భాగ్యనగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం

HYD: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం దాకా ఎండలు మండిపోగా.. హఠాత్తుగా వాతావరణం చల్లబడింది. రాజేంద్రనగర్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. పాతబస్తీ, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, బార్కస్‌, ఉప్పుగూడ, బహదూర్‌పురా, ఛత్రినాక పరిసరాల్లో వర్షం కురుస్తున్నది. రహదారులపై వరదనీరు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ జాం అయ్యింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో పాదచారులు, వాహనదారులు మెట్రో పిల్లర్ల కిందకు చేరారు.
కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తీవ్ర తుఫానుగా మారిందని.. వాయవ్య బంగాళాఖాతమంతా మేఘాలు ఆవరించాయని భారత వాతావరణ శాఖ ( ఐఎండీ ) ప్రకటించింది. రేపటికి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం అందని అంచనా వేసింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా మే 11 వరకు కదిలి తర్వాత దిశ మార్చుకుని ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్-మయన్మార్ తీరం వైపు వెళ్తుందని తెలిపింది. ఉపరితల ద్రోణి తెలంగాణ నుంచి తమిళనాడు వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

Also watch

Psycho Father : కన్నకూతురిని గొడ్డలితో నరికి

ఈ మద్య కురిసిన వానలు వలన అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ లోని  రహమత్‌నగర్‌లో వర్షానికి గోడకూలి 8 నెలల చిన్నారి జీవనిక మృతి చెందింది. నారాయణ్‌ఖేడ్‌కు చెందిన దంపతులు శ్రీకాంత్‌, జగదేవిలు ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి రహమత్‌గనర్‌లోని ఓంనగర్‌లో ఓ రేకుల గదిలో నివాసముంటున్నారు. వీరి కుమార్తే జీవనిక. రాత్రి తమ ఇంట్లో నిద్రిస్తుండగా.. పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల భవనం రేలింగ్ కూలి.. దాని నుంచి రాళ్లు జారి రేకుల గదిపై పడ్డాయి. రేకుల గదిలో తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిపై రాళ్లు పడ్డాయి. దీంతో జీవనిక అక్కడికక్కడే మృతి చెందింది.

అలాగే సికింద్రాబాద్‌లోని కళాసిగూడ‌లో పాల ప్యాకెట్ తీసుకురావడానికి ఇంటి నుంచి సోదరుడుతో కలిసి చిన్నారి మౌనిక బయటకు వచ్చింది. అయితే రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఓపెన్ నాలాను గుర్తించకుండా మౌనిక సోదరుడు అందులో పడబోయాడు. అయితే సోదరుడిని రక్షించిన మౌనిక తాను నాలాలో పడిపోయింది. దీంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో గాలింపు చేపట్టిన జీహెచ్‌ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు  సికింద్రాబాద్‌లోని పార్క్ లేన్ సమీపంలోని నాలాలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.  అందుచేత  అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు

Leave a Reply