సొంత పార్టీపై మధుయాష్కీ ఘాటు విమర్శలు

కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పలు ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ తీరుపై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. కాంగ్రెస్ లో రెడ్లపై ఎలాంటి చర్యలు ఉండవన్నారు. వాళ్లపై చర్యలు తీసుకోవాలంటే చాలా ధైర్యంగా ఉండాలన్నారు. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడే పార్టీ రూల్స్ పాటించడం లేదని ఫైర్ అయ్యారు. సొంత పార్టీ ఎమ్మెల్యే మేఘా రెడ్డిపై క్రమ శిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి బహిరంగంగా ఆరోపణలు చేశాడన్నారు. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిపై క్రమశిక్షణ చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు.

బీసీ నాయకుల మీటింగ్‌కు బీసీ నాయకులను పిలవరా? అని ప్రశ్నించారు. బీసీ మీటింగ్‌కు జానారెడ్డి, కేశవరావును ఎందుకు పిలిచారన్నారు. ఇటీవల కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టిన పోల్ లో ఫామ్ హౌజ్ పాలనే కావాలంటూ మెజార్టీ ఓట్లు వచ్చిన విషయంపై సైతం మరో ఇంటర్వ్యూలో స్పందించారు మధుయాష్కి. కాంగ్రెస్ ఐటీ సెల్ హెడ్ ఒక అసమర్ధుడు.. అతనికి దిమాక్ లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు.

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి నటరాజన్.. పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడవద్దని పదే పదే చెబుతూ వస్తున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటూ అనేక సార్లు స్పష్టం చేశారు. అయినా మధుయాష్కి లాంటి సీనియర్ నేత ఇలాంటి కామెంట్లు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. మధుయాష్కిని కంట్రోల్ చేయడానికి పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనే అంశంపై చర్చ సాగుతోంది.

Leave a Reply