హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi)పై నటి, రాజకీయ నేత కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు చేశారు. బంజారాహిల్స్‌లో కోట్ల విలువ చేసే 1500 గజాల స్థలాన్ని మేయర్ అక్రమంగా సొంతం చేసుకుందని ఆమె ఆరోపించారు. పెద్దమ్మగుడి స్థలం విషయంలో జరుగుతున్న వివాదం ఈ ఆరోపణలకు కారణమైంది.
కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. 2023లో ఈ స్థలాన్ని మేయర్ విజయలక్ష్మి పేరుతో రెగ్యులరైజ్ చేశారని, అది కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతోనే జరిగిందని చెప్పారు. “పెద్దమ్మగుడి కోసం మేము స్థలం అడిగితే గజానికి రూ.2 లక్షలు చెబుతారు. కానీ అదే స్థలాన్ని మేయర్ గజానికి కేవలం రూ.350కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?” అని ఆమె ప్రశ్నించారు. గజానికి లక్షల్లో విలువ చేసే భూమిని ప్రభుత్వం ఇంత తక్కువ ధరకు ఎందుకు ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“మేయర్ కుటుంబం నిజంగా పేదరికంలో ఉందా? లేక స్వాతంత్ర్య సమరయోధుల వారసులా? అలాంటప్పుడు మాత్రమే ప్రభుత్వం తక్కువ ధరకు భూమి కేటాయించే నిబంధనలు ఉంటాయి. మరి విజయలక్ష్మి ఆ అర్హత ఏ విధంగా సాధించారు?” అని కళ్యాణి ప్రశ్నించారు. త్వరలోనే మేయర్‌కి సంబంధించిన అన్ని భూదందాలను ఆధారాలతో బయటపెడతానని హెచ్చరించారు.
అలాగే, గతంలోనూ మేయర్ అక్రమాలపై పత్రికలు, మీడియా రాసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కళ్యాణి గుర్తుచేశారు. “70-80 ఏళ్లుగా అక్కడే ఉన్న పెద్దమ్మగుడికి మాత్రం ప్రభుత్వం స్థలం కేటాయించదు. కానీ సంపన్నుల కుటుంబానికి చెందిన మేయర్ విజయలక్ష్మికి మాత్రం చౌకగా కేటాయిస్తుంది. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వ అండదండలతోనే జరిగిందని స్పష్టంగా కనిపిస్తోంది” అంటూ కళ్యాణి ఫైర్ అయ్యారు.
ఇంకా, పెద్దమ్మగుడికి భూమి కేటాయించాలని డిమాండ్ చేస్తే మమ్మల్ని హౌస్ అరెస్టు చేసి, రాళ్లు రువ్విస్తారని ఆమె ఆరోపించారు. అదే సమయంలో మేయర్ విజయలక్ష్మికి మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా స్థలం రిజిస్ట్రేషన్ జరిగిందని మండిపడ్డారు.
ఈ వ్యవహారంపై తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. “1000 గజాల స్థలాన్ని పెద్దమ్మగుడికి ఇవ్వమంటే ఇవ్వలేదు. కానీ మేయర్ విజయలక్ష్మికి మాత్రం కేటాయించారు. ఆమె 2023లో తన పేరిట ఆ స్థలాన్ని రెగ్యులరైజ్ చేసుకుంది” అంటూ ఆధారాలతో సహా బయటపెట్టారు కరాటే కళ్యాణి.
ప్రస్తుతం కరాటే కళ్యాణి ఆరోపణలతో ఈ భూదందా అంశం మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మేయర్ విజయలక్ష్మి, తెలంగాణ ప్రభుత్వం ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తాయో చూడాలి.