పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 2014 మార్చి 14న పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించిన రోజు. 2019లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటుతో నిలిచిన జనసేన… 2024లో టీడీపీతో కలసి 21 సీట్లు సాధించి, అధికార భాగస్వామిగా మారడం వరకు ఈ పార్టీ ప్రయాణం విశేషమైనది.
అన్నీ చీకట్లు కమ్ముకున్నా… ఒక వెలుగులాంటి నాయకుడు నిలబడితే చాలు. అలాంటి అగ్ని పర్వతాల్లో నడిచి, సముద్రానికి ఎదురెళ్లే అలలా జనసేన ప్రస్థానం సాగింది. పవన్ కళ్యాణ్ నిప్పులా ఊగిపోయే ప్రసంగాలు, మనసును తాకే డైలాగులతో కోట్లాదిమందిని ఆకట్టుకున్నారు. సినిమా తెరను దాటి ప్రజల కోసం పోరాడాలనే లక్ష్యంతో “జన సైనికుడిగా” రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇవాళ జనసేనకు పుట్టిన రోజు… కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జనసేన 12 ఏళ్ల ప్రస్థానాన్ని ఓసారి మనం వెనక్కి తిరిగి చూద్దాం.
పవన్ కళ్యాణ్ అంటే పవర్… ఆయన చేసే ప్రతి పని ఓ సెన్సేషన్. అలాంటి పవన్ 2014 మార్చి 14న జనసేన పార్టీని ప్రారంభించారు. తొలిసారి హైదరాబాద్ నోవోటెల్‌లో జరిగిన ఆవిర్భావ సభలో, కాంగ్రెస్ మీద విరుచుకుపడి రాష్ట్ర విభజన విషయంలో ప్రజలను మోసగించిందని మండిపడ్డారు.
2014 మార్చి 10న పార్టీని ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేసి, అదే ఏడాది డిసెంబర్ 11న అధికారిక గుర్తింపు పొందారు. జనసేన పార్టీ జెండా ఒక తెల్లని నేపథ్యంపై, చే గువేరా విప్లవ స్ఫూర్తితో రూపొందించిన ఆరు కొన్ల ఎర్ర నక్షత్రం. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి నాదెండ్ల మనోహర్ ఛైర్మన్‌గా, పవన్ అన్న నాగబాబు సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు.
పార్టీ ఏర్పాటు చేసిన తక్కువ సమయంలోనే ఎన్నికలు రావడంతో, జనసేన 2014లో పోటీకి దిగలేదు. బీజేపీ, టీడీపీకి మద్దతు ప్రకటించి, చంద్రబాబును గెలిపించడంలో పవన్ కీలకపాత్ర పోషించారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో పవన్ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, రెండింటినీ విమర్శించారు.
2019లో జనసేన మిగిలిన 175 నియోజకవర్గాల్లోనూ పోటీచేసింది. కమ్యూనిస్టులతో పాటు బీఎస్పీతో కలిసి ఎన్నికలకు వెళ్లినా, ఫలితాలు నిరాశపరిచాయి. పార్టీ తరఫున ఒక్క రాజోలు అసెంబ్లీ స్థానం మాత్రమే గెలిచింది. పవన్ కళ్యాణ్ స్వయంగా గాజువాక, భీమవరం రెండు చోట్లా ఓడిపోవడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ.
2019 పరాజయాన్ని అంగీకరించిన పవన్, తన వైఫల్యాలపై విశ్లేషించి, 2024లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈసారి ప్రజలు విశ్వాసం చూపించి, జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో అన్ని గెలిపించారు. దీంతో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, తిరుగులేని రాజకీయ ప్రస్థానాన్ని చూపించారు.
పార్టీలో క్రమశిక్షణ విషయంలో పవన్ చాలా కఠినంగా వ్యవహరించారు. పార్టీకి ఇమేజ్ దెబ్బతీసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఉదాహరణకి, వివాదంలో ఉన్న జానీ మాస్టర్, కిరణ్ రాయల్‌లను పార్టీ నుంచి బహిష్కరించారు. అలాగే, ప్రత్తిపాడు ఇన్‌చార్జ్ అయిన తమ్మయ్యను ఓ మహిళా డాక్టర్‌తో దుర్వినియోగానికి పాల్పడ్డాడని పార్టీ నుంచి తొలగించారు.
ఒంటరిగా ప్రారంభమైన జనసేన ప్రస్థానం, ఈరోజు అధికార పార్టీలో భాగమై, పవన్ కళ్యాణ్ ను ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేర్చింది. ఈ 12 ఏళ్లలో పార్టీ అనేక ఒడిదుడుకులు చూశినా, పవన్ కళ్యాణ్ ప్రజల కోసం నిస్వార్థంగా చేసిన పోరాటం అసమానమైనది. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, పార్టీ భవిష్యత్తు మరింత బలంగా ముందుకు సాగాలని ఆశిద్దాం.
జనసేన పార్టీ సభ్యత్వ నమోదు 10 లక్షలు దాటినప్పటికీ గ్రామస్థాయి నుంచి కమిటీలు లేకపోవడం పార్టీ బలోపేతానికి సవాలుగా మారింది. జనసేన 12వ ఆవిర్భావ సభ ద్వారా పార్టీ నిర్మాణంపై స్పష్టమైన ప్రకటన వస్తుందని శ్రేణులు ఆశిస్తున్నాయి. ఇన్నాళ్లూ రాజకీయపార్టీగా జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఇప్పుడు 12వ ఆవిర్భావ సభను అధికారంలో ఉన్న పార్టీగా నిర్వహించుకోవడం జనసైనికుల్లో రెట్టించిన ఆనందోత్సాహాలను నింపుతోంది.