GST Rates : ఢిల్లీలో జీఎస్టీ సమావేశం.. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే అవకాశాలు

ఢిల్లీలో ఈరోజు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పన్ను రేట్లలో కీలక మార్పులు చేయనున్నారు. దీనివల్ల బిస్కెట్లు, దుస్తులు, హైబ్రీడ్ కార్లు, మోటార్‌సైకిళ్లు వంటి వస్తువుల ధరలు తగ్గే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో మొత్తం 33 మంది సభ్యులు పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి భట్టి విక్రమార్క, ఏపీ నుంచి పయ్యావుల కేశవ్ హాజరవుతున్నారు. సీబీఈసీ చైర్మన్ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది.

Also Read: TCSలో 12 వేల మందికి షాక్.. జీతాలు మాత్రం భారీగా పెంచిన కంపెనీ!

జీఎస్టీ రేట్లలో పెద్ద మార్పులు 

ప్రస్తుతం అమలులో ఉన్న 5%, 12%, 18%, 28% శ్లాబులను కేవలం 5% మరియు 18% శ్లాబులకే పరిమితం చేయాలని ప్రతిపాదన ఉంది. అయితే హానికారక ఉత్పత్తులపై మాత్రం 40% పన్ను విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. చిన్న హైబ్రీడ్ కార్లు, మోటార్‌సైకిళ్లపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించే యోచనలో ఉన్నారు. అలాగే ఎస్‌యూవీలపై 50% పన్నును 40%కు తగ్గించే అవకాశం ఉంది. దీని వలన వాహనాల ధరలు 6–8% వరకు తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

హెల్త్ ఇన్సూరెన్స్, నిత్యావసరాలపై ఊరట
బిస్కెట్లు, దుస్తులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం (Health Insurance Premium) వంటి వాటిపై కూడా జీఎస్టీ తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల నేరుగా ప్రజలకు లాభం చేకూరుతుందని భావిస్తున్నారు.

2017 జూలై 1న జీఎస్టీ వ్యవస్థ భారత్‌లో అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇది 56వ సమావేశం. ఈసారి తీసుకునే నిర్ణయాలు ఇప్పటివరకు జరిగిన సంస్కరణల్లో అతి పెద్దవిగా నిలుస్తాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. దీపావళి కానుకగా పన్ను రేట్ల తగ్గింపు ప్రజలకు పెద్ద ఊరట ఇస్తుందని కేంద్రం చెబుతోంది.

Leave a Reply