తెలంగాణలో యూనివర్సిటీల పేర్లు మార్చడంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తిప్పికొట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత పరిపాలనలో భాగంగా కొన్ని పాలనా పరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆ క్రమంలోనే యూనివర్సిటీల పేర్ల మార్పు జరుగుతోందని తెలిపారు. కానీ, విపక్షాలు ఈ అంశాన్ని రాజకీయ పరంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
తెలంగాణలో యూనివర్సిటీల పేర్ల మార్పు వెనుక కులాల రాజకీయాలు లేవని సీఎం స్పష్టం చేశారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత, గత పదేళ్లలో పేర్ల మార్పుకు గల కారణాలను వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన మహానీయులను గౌరవిస్తూ వారి పేర్లు యూనివర్సిటీలకు ఇస్తున్నామని వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించబడిన యూనివర్సిటీల పేర్లు ఇంకా అలాగే కొనసాగడం వల్ల పరిపాలనలో గందరగోళం ఏర్పడుతోందని తెలిపారు. అందువల్లే, కొత్తగా ఏర్పడిన తెలంగాణలో సంస్థలకు, యూనివర్సిటీలకు తెలంగాణకు చెందిన మహనీయుల పేర్లు పెడుతున్నామని స్పష్టం చేశారు.
ఇందులో భాగంగా, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ నారాయణరావు పేరు పెట్టారని, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు పేరు పెట్టామని వివరించారు. దీంతో ఎన్టీఆర్, వైఎస్ఆర్ లను అవమానపరచినట్లు కాదని, వారి సేవలను తక్కువ చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు మార్చడం జరుగుతుందని వెల్లడించారు.
ఈ వివాదంపై స్పందిస్తూ, గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం పేరు ప్రధాని మోదీ పేరుగా మారిన విషయాన్ని బీజేపీ నేతలు గమనించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాణత్యాగం చేసిన మహనీయులను గౌరవించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయాలు తీసుకుందని వివరించారు.
తెలంగాణలో నూతనంగా ప్రారంభించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని సీఎం కోరారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించి అనుమతులు తీసుకురావాలని సూచించారు. అలాగే, బల్కంపేట నేచర్ క్యూర్ హాస్పిటల్‌కు మాజీ సీఎం రోశయ్య పేరు పెడతామని వెల్లడించారు. ఆయన సేవలను స్మరించుకునేలా అక్కడ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించాలని సీఎం పిలుపునిచ్చారు.