సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపామని, కానీ కేంద్రం వాటిని ఆమోదించకుండా అన్యాయం చేస్తోందని ఆయన అన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి, “దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో మేము చేసి చూపించాం. శాస్త్రీయంగా కులగణన చేసి, బహుజనుల సంఖ్య 56.33% అని నిర్ధారించాం. దానికి అనుగుణంగా 42% రిజర్వేషన్ కల్పించే చట్టాలు పంపాం. కానీ బీజేపీ అడ్డుకుంటోంది” అని పేర్కొన్నారు.
అలాగే గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన చట్టం బీసీలకు శాపంగా మారిందని విమర్శించారు. గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్‌లో పడేయడం వల్లే ఢిల్లీలో ధర్నా చేశామని గుర్తు చేశారు. “బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి, మోదీ కాదా?” అని ప్రశ్నించారు.
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎక్కడా లేవని, కానీ బహుజనుల హక్కులను దొంగిలించే కుట్ర బీజేపీ చేస్తున్నదని ఆరోపించారు. నాగ్‌పూర్, గుజరాత్, యూపీలో ముస్లిం బీసీలకు రిజర్వేషన్లు తొలగించగలరా? అని నిలదీశారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ను గౌరవిస్తూ ఆయన విగ్రహాన్ని సచివాలయం దగ్గర ఏర్పాటు చేస్తున్నామని, “విగ్రహాలు పూలు పెట్టుకునేందుకు కాదు, స్ఫూర్తి రగిలించేందుకే” అని అన్నారు.
అలాగే ఓట్ల దోపిడీ అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదవుతున్నాయని ఆరోపించారు. “బ్రతికున్న వారిని చనిపోయినట్లు చూపించి ఓట్లు తొలగిస్తున్నారు. ఈ కుట్రను బయటపెట్టింది రాహుల్ గాంధీ” అని అన్నారు.
“త్వరలో నేనే డిప్యూటీ సీఎంతో కలిసి రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటాను. ఇక్కడ కూడా దొంగ ఓట్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాం. అందరం కలిసికట్టుగా బీజేపీ కుట్రలను అడ్డుకోవాలి” అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.