YS Sharmila: ఇలాంటి సైకోలకి సమాజంలో ఉండే హక్కు లేదు.. వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు..!

ఒక మహిళపై అసభ్యంగా మాట్లాడిన కార్యకర్తపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి అయిన వైఎస్ భారతి రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ని లక్ష్యంగా చేసుకుని షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఇలాంటి సైకో మానసిక రోగులను నడిరోడ్డుపై ఉరి తీయాలి’’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

షర్మిల మాట్లాడుతూ ‘‘ఇది అసహ్యకరమైన సంస్కృతి. మహిళలను టార్గెట్ చేస్తూ మాట్లాడే వారి పట్ల సమాజం తీవ్రంగా స్పందించాలి. ఇవి కేవలం వ్యక్తిగత దాడులు కాదు, సిస్టమ్‌పై దాడులు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలే ఈ విష సంస్కృతికి మూలం’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి ఘాటు వ్యాఖ్యలతో షర్మిల ఈ అంశాన్ని కేవలం రాజకీయ వ్యవహారంగా కాకుండా, సామాజిక సమస్యగా నిలిపేందుకు ప్రయత్నించారు. ‘‘ఏ పార్టీకి చెందినవాళ్లైనా, ఎంతటి స్థాయిలో ఉన్నా ఇలాంటివారికి కఠిన శిక్ష పడాల్సిందే’’ అని స్పష్టం చేశారు. అసభ్య రాజకీయ సంస్కృతి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే ప్రతీ పార్టీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు.

పార్టీ పరంగా.. చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం కూడా ఫైర్ అయ్యింది. కిరణ్‌ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల మేరకు గుంటూరు పోలీసులు కేసు నమోదు చేసి కిరణ్‌ను అరెస్ట్ చేశారు. అయితే, కిరణ్ తన చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. “క్షణికావేశంలో అన్నాను.. నన్ను క్షమించండి” అంటూ బదులిచ్చిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కేవలం ఓ వ్యక్తి తప్పిదం కాదు.. రాష్ట్ర రాజకీయాల్లో మహిళల పట్ల ఉన్న అవమానకర భావజాలానికి ప్రతిబింబం. ఇది ఆపాలని కోరుతూ షర్మిల ఇచ్చిన పిలుపు కొత్త చర్చలకు దారి తీస్తోంది.

Leave a Reply