ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వడంపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ పార్టీ అసలు ముసుగు తొలిగిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. లోపల దాగి ఉన్న కాషాయ రంగు మరోసారి బయటపడిందని విమర్శించారు. బీజేపీకి వైసీపీ నిజంగానే బీ-టీమ్ అని తేలిపోయిందని షర్మిల స్పష్టం చేశారు.
మోదీకి జగన్ దత్తపుత్రుడని ప్రజలకు స్పష్టమైందని ఆమె పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం పేరుతో ఉన్నది మోడీ పక్షమేనని తేటతెల్లమైందన్నారు. అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్ళీ దాసోహం అయ్యారని, ఐదేళ్లలో దోచుకున్నదాన్ని దాచుకోవడానికి బీజేపీకి జై కొడుతున్నారని షర్మిల తీవ్రంగా విమర్శించారు.
YCP @YSRCParty ముసుగు మళ్ళీ తొలగింది. లోనున్న కాషాయ కండువా మరోసారి బయటపడింది. బీజేపీకి @BJP4India బీ-టీం అని నిజ నిర్ధారణ జరిగింది. మోడీ @narendramodi గారికి దత్తపుత్రుడే అని రాష్ట్ర ప్రజలకు కుండబద్దలు కొట్టినట్లు అర్ధం అయ్యింది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోడీ గారి…
— YS Sharmila (@realyssharmila) August 22, 2025
జగన్ అసలు రూపం బయటపెట్టిన షర్మిల.. సంచలన ట్వీట్!
చంద్రబాబు, జగన్, పవన్ ముగ్గురు మోదీ తొత్తులేనని ఆమె ఫైర్ అయ్యారు. వీరంతా బీజేపీకి ఊడిగం చేసే బానిసలేనని ఆరోపించారు. టీడీపీ, జనసేన పొత్తు తెరమీద కనిపిస్తున్నా.. వైసీపీ మాత్రం ఢిల్లీలో బీజేపీతో రహస్య అక్రమ పొత్తు పెట్టుకుందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష కూటములతో కుస్తీ పడుతూ, ఢిల్లీలో మాత్రం బీజేపీతో స్నేహం కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడాన్ని షర్మిల తీవ్రంగా ఎద్దేవా చేశారు. దేశంలో ఓటు దోపిడీతో రాజ్యాంగం ఖూనీ అవుతుంటే, వైసీపీకి అది కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మోదీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నా, వైసీపీ నోరు విప్పలేదని ఆమె మండిపడ్డారు.
దేశ ప్రతిపక్షాలు కలిసి రాజకీయాలతో సంబంధం లేని ఒక తెలుగు న్యాయ నిపుణుడిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టగా, వైసీపీ మాత్రం ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతు ఇచ్చిందని షర్మిల ప్రశ్నించారు. తెలుగు ప్రజలకు చేసిన ఈ ద్రోహంపై వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.