వైఎస్ జగన్‌కు ఈడీ షాక్.. దాల్మియా సిమెంట్స్ రూ.793 కోట్ల ఆస్తుల జప్తు

వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. Enforcement Directorate (ఈడీ) తాజాగా ఈ కేసులను మళ్లీ యాక్టివ్ చేస్తూ, దాల్మియా సిమెంట్స్‌కు చెందిన రూ.793 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. కడప జిల్లాలోని సున్నపురాయి గనుల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై గతంలో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈడీ తాజా చర్యలతో కేసులు మళ్లీ చురుకుగా సాగనున్నాయి. సీబీఐ నివేదిక ప్రకారం, జగన్‌ మొహన్ రెడ్డికి దాల్మియా సిమెంట్స్ నుంచి దాదాపు రూ.150 కోట్ల మేర లాభం చేరిందని తేలింది. ఇందులో రూ.95 కోట్లు షేర్ల రూపంలో, రూ.55 కోట్లు హవాలా లావాదేవీల ద్వారా వచ్చినట్లు ఈడీ పేర్కొంది.

వైఎస్‌ఆర్ హయాంలో దాల్మియా సిమెంట్స్‌కు కడప జిల్లాలో 417 హెక్టార్ల భూమిని లీజుగా ఇచ్చారు. ఈ వ్యవహారానికి ప్రతిఫలంగా జగన్‌కు చెందిన సాక్షి మీడియా సంస్థలలో భారీగా పెట్టుబడులు వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిని మనీ లాండరింగ్‌గా గుర్తించిన ఈడీ, సంబంధిత ఆస్తులను ప్రొవిజనల్‌గా జప్తు చేసింది.

ఇంతలో దాల్మియా గ్రూప్‌కు చెందిన పునీత్ దాల్మియా, తమపై ఉన్న కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ విచారణకు పలుమార్లు హాజరుకాకపోవడంతో, 2021లో హైకోర్టు రోజుకు రూ.50,000 జరిమానా విధించింది. విచారణ ఆలస్యం చేయడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

13 ఏళ్ల తర్వాత ఈడీ జోక్యం కలిగించడంతో జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఈ కేసులు తెలంగాణ హైకోర్టు, సీబీఐ కోర్టులో విచారణలో ఉన్నాయి. సుప్రీంకోర్టు వేగవంతమైన విచారణకు ఆదేశించినా, ప్రాక్టికల్‌గా పురోగతిలో మందగమనం కనిపిస్తోంది. అయితే తాజా ఆస్తుల జప్తుతో మళ్లీ ఈ కేసులు కదలికలోకి వచ్చాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Leave a Reply