వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. కోవూరు నియోజకవర్గానికి చెందిన మాజీ వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
తన పరువు, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారంటూ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కోవూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె అందించిన వీడియో ఆధారంగా BNS సెక్షన్లు 74, 75, 79, 296 r/w 3(5) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి, ఇతర నాయకులు మాట్లాడిన వీడియో క్లిప్‌ను ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసులో ఇతర వ్యక్తులపై కూడా అభియోగాలు నమోదైనట్లు సమాచారం.
ప్రసన్నకుమార్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నేతగా ఉన్నప్పటికీ ఇలాంటి వ్యక్తిగత విమర్శలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని పలువురు కూటమి నేతలు స్పందించారు.
కోవూరు ఎమ్మెల్యే @Prashanthi_VPR గారిపై మురికి వ్యాఖ్యలతో మహిళా లోకాన్ని కించపరిచిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని మహిళ కమిషన్ ఛైర్పర్సన్ @SailajaRayapati గారికి కోరిన మహిళా సంఘాలు. pic.twitter.com/PoxuZci6k2
— MC RAJ🕊️ (@BeingMcking_) July 8, 2025
ఈ ఉదంతం నేపథ్యంలో సోమవారం రాత్రి, నెల్లూరు నగరంలో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఫర్నీచర్, కారు సహా ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. దాడి జరిగిన సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడం తో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.
ఈ దాడిని టీడీపీ శ్రేణులు లేదా ప్రశాంతి రెడ్డి అనుచరుల పని అంటూ వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఈ ఘటన నెల్లూరు జిల్లాలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది.