రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం గణేశుడి మెడలో వేసిన 5 తులాల బంగారు గొలుసుతోనే విగ్రహాన్ని పొరపాటున నిమజ్జనం చేయడం పెద్ద హడావుడికి కారణమైంది.
హస్తినాపురానికి చెందిన ఆ కుటుంబం మూడు రోజుల పాటు గణేశ నవరాత్రి వేడుకలు జరిపింది. ఈ సందర్భంగా గణేశుడి విగ్రహానికి ఐదు తులాల బంగారు చైన్ వేసి పూజలు చేశారు. దేవుడి దగ్గర ఉంచిన బంగారాన్ని తిరిగి ధరించడం శుభం అవుతుందనే నమ్మకంతో ఈ ఆచారాన్ని పాటించారు.
శనివారం నాడు నిమజ్జనం కోసం మాసాబ్ చెరువుకు వెళ్లి గణేశుడిని నీటిలో వదిలారు. కానీ కొంతసేపటికే ఇంటి మహిళకు గణేశుడి మెడలో బంగారు గొలుసు పెట్టారన్న విషయం గుర్తుకొచ్చింది. దీంతో ఆందోళన చెందిన ఆమె మున్సిపల్ సిబ్బందికి ఈ విషయాన్ని తెలిపింది.
తక్షణమే స్పందించిన అధికారులు JCB సహాయంతో విగ్రహాలను నీటిలో నుంచి బయటకు తీశారు. చివరికి గణేశుడి మెడలో బంగారు చైన్ సురక్షితంగానే ఉండటంతో కుటుంబం ఊపిరిపీల్చుకుంది. మున్సిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ, అక్కడున్న వారు వాళ్ళు చేసిన వేగవంతమైన చర్యను ప్రశంసించారు.