నిన్న జైలు నుంచి విడుదల.. ఈ రోజు నేరుగా జగన్ వద్దకు వల్లభనేని వంశీ!

వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బుధవారం మధ్యాహ్నం విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై నమోదైన మొత్తం 11 కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో వంశీకు విడుదల కలిగింది.

గత ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లోని మైహోం భుజా అపార్ట్‌మెంట్‌లో వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్, బెదిరింపులు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, నకిలీ హౌసింగ్ పట్టాలు, అక్రమ గనుల తవ్వకాల వంటి కేసులు ఆయనపై నమోదయ్యాయి. ఇందులో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడ ఆరోపణలు ఉన్నాయి.

ఫిబ్రవరి 16న రిమాండ్‌కు వెళ్లిన వంశీ దాదాపు 140 రోజులు విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన మరుసటి రోజు.. కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి ఆయనను కలిసి పరస్పరం అభివాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జగన్ వంశీని పరామర్శించి, ధైర్యం చెబుతూ.. “అక్రమంగా అరెస్టు చేసిన వారిపై న్యాయపోరాటం చేద్దాం. ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారు” అని హామీ ఇచ్చినట్లు సమాచారం. అంతేగాక, తన కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైఎస్ జగన్‌కు వల్లభనేని వంశీ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply