తిరుమల శ్రీవారి ఆలయం పరిసరాల్లో రీల్స్ వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య దివ్వెల మాధురికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది.
తాజాగా ఈ జంట తిరుపతిలో శ్రీవారి దర్శనం అనంతరం, గెస్ట్‌హౌస్ వద్ద మాధురి లంగావోణీ ధరించి రీల్స్ రూపొందించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆధ్యాత్మికతకు కేంద్రబిందువైన తిరుమల కొండపై ఇలా సోషల్ మీడియా వీడియోలు తీయడం పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
గతంలోనూ ఇదే విధంగా:
ఇది మాధురి, దువ్వాడ శ్రీనివాస్ దంపతులపై టీటీడీ చేపట్టిన తొలి చర్య కాదు. గతంలో కూడా వీరిద్దరూ ఆలయ పరిసరాల్లో రీల్స్ చేస్తుండగా విచారణకు గురయ్యారు. అప్పట్లో తిరుమల మాడ వీధుల్లో వీడియోలు రూపొందించడం వల్ల బీఎన్ఎస్ సెక్షన్లు 292, 296, 300, ఐటీ చట్టం సెక్షన్ 66 (200-2008) కింద కేసులు నమోదయ్యాయి.
తాజా ఘటనపై టీటీడీ విజిలెన్స్ విభాగం సీరియస్‌గా స్పందించింది. తిరుమలలో పవిత్రతను భంగపరిచే చర్యలు ఎవరి నుండి వచ్చినా వదలబోమని స్పష్టం చేస్తూ, నోటీసులు జారీ చేసింది. ఆ వీడియోలపై పూర్తి విచారణ అనంతరం మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.