AP SSC Results 2023: రేపే పదవ తరగతి ఫలితాలు
AP SSC Results 2023: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. అలాగే ఏపీలో విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న 10వ తరగతి ఫలితాలు రేపు (శనివారం) పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి.
ఉపాధ్యాయ సంఘాల నేతలతో శుక్రవారం జరిగిన చర్చల అనంతరం ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ మేరకు టెన్త్ ఫలితాల విడుదల తేదీపై అధికారిక ప్రకటన విడుదలైంది.రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. మే రెండో వారంలో ఫలితాలు విడుదల అవుతాయని ముందుగా ప్రచారం జరిగినా.. మార్కుల టేబులేషన్, అప్లోడ్ ప్రక్రియ పూర్తవ్వడంతో రేపు విడుదల చేయనున్నారు.
అలాగే ఏపీలో 6.5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాసినట్టు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి ఇటీవల వెల్లడించారు. ఏపీలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరిగాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. హాల్‌టికెట్ ఆధారంగా విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించారు.
అయితే ఈ సారి ఏడు ప్రాంతీయ భాషలలో ఎగ్జామ్స్ రాశారు. విద్యార్థులు రాష్ట్ర భాషా వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ తెలుగు, ఇంగ్లిష్, కన్నడ, తమిళం, హిందీ, ఉర్దూ, ఒడియా భాషల్లో పరీక్షలు రాసే అవకాశం కల్పించారు. ఎగ్జామ్స్ పూర్తయిన వెంటనే ఏప్రిల్ 19 నుంచి 26 వరకు మూల్యాంకనం కూడా పూర్తి చేశారు. స్పాట్ వాల్యుయేషన్‌లో దాదాపు 35 వేల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. bse.ap.gov.in. వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది ఏపీ వ్యాప్తంగా 3449 పరీక్ష కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. వీటిలో 682 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా విద్యార్థులుండగా, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్లలో అత్యల్పంగా ఉన్నారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు, మాల్ ప్రాక్టీస్ ను నిరోధించడానికి 156 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 682 సిట్టింగ్ స్క్వాడ్లతో పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించారు.