తెలుగు ఫిల్మ్ ఛాంబర్ చివరికి సినీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేతనాలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో సినీ కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవల టాలీవుడ్‌లో కార్మికుల వేతనాల పెంపు పెద్ద చర్చగా మారింది. తమ వేతనాలను 30% పెంచాలని డిమాండ్ చేస్తూ, కార్మికులు షూటింగ్స్ నిలిపివేసి సమ్మెలోకి దిగారు. దాంతో సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌ల షూటింగులు దాదాపు 15 రోజులు ఆగిపోయాయి. ఈ వ్యవధిలో కార్మిక సంఘాలు, నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ మధ్య వాదోపవాదాలు జరిగాయి.
చివరికి ఈ నెల 22న కార్మిక శాఖ సమక్షంలో 13 కార్మిక సంఘాలు, నిర్మాతల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం కార్మికుల వేతనాలను 22.5% పెంచాలని నిర్ణయించారు. అంతేకాకుండా వచ్చే ఏడాది ఆగస్టు 22 వరకు మరో 15% పెంపు అమలు చేయాలని కూడా నిర్ణయించారు.
జూనియర్ ఆర్టిస్టుల వేతనాలు:
‘ఏ’ కేటగిరీ: రోజుకు రూ. 1,420
‘బి’ కేటగిరీ: రోజుకు రూ. 1,175
‘సి’ కేటగిరీ: రోజుకు రూ. 930
అదనంగా, షూటింగ్ సమయంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం అందించకపోతే ప్రత్యేకంగా చెల్లించాలని నిర్ణయించారు.
బ్రేక్ ఫాస్ట్ లేకపోతే రూ. 70
లంచ్ లేకపోతే రూ. 100 అదనంగా చెల్లించాలి
అలాగే కాల్ షీట్ రేట్లు:
పూర్తి కాల్ షీట్ (ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు): రూ. 1,470
సగం కాల్ షీట్: రూ. 735
ఈ నిర్ణయంతో టాలీవుడ్‌లో నెలకొన్న వేతన వివాదానికి పరిష్కారం లభించింది. ఇకపై కార్మికుల జీవన స్థితి కొంతవరకు మెరుగుపడుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.