తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నేడు జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర జలశక్తి కార్యాలయంలో జరుగుతుంది.
ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రెండు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
ఏజెండాలో ఏముంది?
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని పక్కన పెట్టాలని తెలంగాణ సీఎస్, జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.
కృష్ణా, గోదావరి బేసిన్లకు సంబంధించిన పెండింగ్ సమస్యలను చర్చించాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ పంపించారు.
ఇక నిన్న రాత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు వ్యాఖ్యలు
రాయలసీమ కరువు ప్రాంతాలకు నీరు అందించేందుకే పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు అవసరమని అన్నారు.
సముద్రంలో వృథాగా కలిసిపోతున్న గోదావరి నీటిని వినియోగించుకోవడానికి ఈ ప్రాజెక్టు ముఖ్యమని తెలిపారు.
రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో, పోలవరం నుంచి కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ వరకు 200 టీఎంసీల వరదనీటిని తరలించే లింక్ ప్రాజెక్టు ప్రతిపాదించామని వివరించారు.
గోదావరిలో ఎగువ, దిగువ రాష్ట్రాల అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90-120 రోజుల పాటు మిగులు నీరు ఉంటుందని, చివరి రాష్ట్రంగా ఆ మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని స్పష్టం చేశారు.