తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా చేనేత కార్మికులైన నేతన్నల కోసం మరో కీలక ప్రకటన చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నేతన్నలపై ఉన్న రూ.లక్షలోపు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.19.24 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసినట్టు అధికారులు వెల్లడించారు.

ఈ రుణ మాఫీ 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి మధ్యకాలంలో చేనేత రంగంలో తీసుకున్న రుణాలకు వర్తించనుంది. ఉత్పత్తి, నిర్వహణ మరియు వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకున్న రుణాలన్నీ ఈ మాఫీ పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే లబ్ధిదారులకు మొబైల్ మెసేజ్‌లు రావడం ప్రారంభమవడంతో నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

యాదాద్రి జిల్లాలో ప్రత్యేకంగా:

మొత్తం 2,380 చేనేత కార్మికుల ఖాతాల్లోకి రూ.19.24 కోట్లు జమ.

43 చేనేత సహకార సంఘాల ద్వారా వేల మంది కార్మికులు లబ్ధి పొందారు.

39 బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలుగా తీసుకున్న మొత్తాల్లో లక్ష రూపాయల లోపు మొత్తం మాఫీ.

1,162 మంది నేతన్నలు రూ.6 కోట్ల వరకు రుణ మాఫీ లబ్ధి పొందనున్నారు.

రూ.లక్షకు పైగా రుణాలు తీసుకున్న 1,537 నేతన్నలకు లక్ష వరకూ మాఫీ వర్తిస్తుంది.

ఇక గతంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించినట్లు, రాష్ట్రవ్యాప్తంగా 5691 మంది నేతన్నల రుణమాఫీకి 33 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. రుణమాఫీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, మిగిలిన నిధులను కూడా విడుదల చేస్తామని తెలిపారు.

నేతన్న పొదుపు పథకం వివరాలు:

ఇప్పటివరకు 33,913 మంది నేతన్నలు పథకంలో నమోదు.

వార్షిక వేతనంలో 8% వారు పెట్టిన నేతన్నల RD ఖాతాల్లోకి ప్రభుత్వం 16% జమ చేస్తుంది.

భరోసా పథకంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.48.8 కోట్లు కేటాయించింది.

ఈ రుణ మాఫీ ప్రకటనతో తెలంగాణ నేతన్నలకు ఊరట లభించిందని చెప్పాలి.

Leave a Reply