మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ (SHE Teams) నిరంతరం ఆకతాయిలకు చెక్ పెడుతోంది. హైదరాబాద్ నగరంలో మహిళలపై ఈవ్‌టీజింగ్, అసభ్య ప్రవర్తనలకు పాల్పడేవారిపై షీ టీమ్స్ కఠిన చర్యలు తీసుకుంటోంది.
తాజాగా మొహర్రం, బోనాల పండుగల సందర్భంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి 478 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ముఖ్యంగా గోల్కొండ బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మహిళా భక్తులతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఆపరేషన్‌లో 14 బృందాల షీ టీమ్స్ పాల్గొన్నాయి. మొత్తం పట్టుకున్న వారిలో 386 మంది మేజర్లు, 92 మంది మైనర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో 288 మందిని హెచ్చరించి వదిలిపెట్టగా, 5 మందిని దోషులుగా నిర్ధారించారు. ఒకరికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించినట్లు వెల్లడించారు.
సహాయం కోసం షీ టీమ్స్‌ను డయల్ 100 లేదా 9490616555 వాట్సాప్ నెంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.