తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. ప్రయాణికులకు సౌకర్యం, సంస్థకు ఆదాయం అనే రెండు లక్ష్యాలతో త్వరలో రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో వైఫై సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
బస్సుల్లో ఇంటర్నెట్, సినిమాలు, పాటలు..
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా బస్సులు, బస్టాండ్లు, రవాణాశాఖ కార్యాలయాల్లో వైఫై అందించడంతో పాటు, ముందుగానే అప్‌లోడ్ చేసిన సినిమాలు, పాటలు తదితర వినోద కంటెంట్‌ను ప్రయాణికులు తమ మొబైళ్లలో వీక్షించగలగాలన్నది ఆ ప్రణాళిక. ఇది సాధారణ వైఫై యాక్సెస్ కంటే భిన్నంగా ఉండబోతుంది.
వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం పెంచుకోవాలనే ఆలోచన
ఈ కంటెంట్ మధ్యలో వచ్చే వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం వచ్చే విధానాన్ని ఈ ప్రైవేట్ సంస్థ ప్రతిపాదించింది. అందులో కొంత వాటాను ఆర్టీసీతో పంచుకోవాలన్న ఆలోచన కూడా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవస్థ ద్వారా ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో వినోదం, ఆర్టీసీకి అదనపు ఆదాయం లభించనున్నట్లు తెలుస్తోంది.
మంత్రి స్థాయిలో సమీక్ష
ట్రాన్స్‌పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో జరిగిన సమీక్షలో ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రాజెక్ట్ వివరాలు సమర్పించారు. త్వరలో మరో రౌండ్ చర్చల అనంతరం పూర్తిస్థాయి కార్యచరణను రూపొందించనున్నట్లు సమాచారం.
ప్రయాణం మరింత సౌకర్యవంతం కానుందా?
ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో కొత్త దిశగా అడుగులు వేసిన తెలంగాణ ప్రభుత్వం, ఈసారి సాంకేతిక రంగంలో మరో ముందడుగు వేయనుంది. ఈ వైఫై ప్రాజెక్ట్ అమలైనట్లయితే, ప్రయాణికులకి ప్రయాణ సమయంలో వినోదం లభించడమే కాకుండా, బస్సుల్లో ప్రయాణం మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది.