RTC Drivers : తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్లకు బిగ్ షాక్.. సంస్థ సంచలన నిర్ణయం!

ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు ప్రమాదాలను తగ్గించేందుకు డ్రైవర్లపై కఠిన నియమావళి అమలు చేయనుంది. ఇందులో భాగంగా డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఆర్టీసీ సంచలన నిర్ణయం తీసుకుంది.

సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు రాష్ట్రంలోని 11 డిపోల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ నిబంధన అమల్లోకి రానుంది. రాష్ట్రంలో మొత్తం 97 డిపోలు ఉన్నప్పటికీ, తొలిదశలో ఫరూఖ్‌నగర్‌, కూకట్‌పల్లి, కొల్లాపూర్‌, సంగారెడ్డి, మిర్యాలగూడ, వికారాబాద్‌, ఉట్నూర్‌, జగిత్యాల, ఖమ్మం, కామారెడ్డి, పరకాల డిపోలను ఈ ప్రయోగాత్మక విధానానికి ఎంపిక చేశారు.

కొత్త నిబంధనల ప్రకారం:

డ్యూటీకి హాజరయ్యే డ్రైవర్లు తమ మొబైల్ ఫోన్లను డిపోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక లాకర్లలో భద్రపరచాలి.

డ్యూటీ పూర్తైన తర్వాత మాత్రమే ఫోన్లు తిరిగి తీసుకోవచ్చు.

అత్యవసర సమాచారం కోసం కుటుంబ సభ్యులు లేదా అధికారులు బస్సు కండక్టర్‌ను సంప్రదించవచ్చు.

ఆర్టీసీ విజిలెన్స్ విభాగం తనిఖీల్లో కొంతమంది డ్రైవర్లు డ్యూటీ సమయంలో మొబైల్ వాడుతున్నట్లు బయటపడటంతో, ఇది ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారుతుందని యాజమాన్యం భావించింది. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

పైలట్ ప్రాజెక్టు ఫలితాలను బట్టి, భవిష్యత్తులో రాష్ట్రంలోని అన్ని డిపోల్లో కూడా ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేసే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply