తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి రేషన్ షాపులు బంద్ కానున్నాయి. దీనికి ప్రధాన కారణం.. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఐదు నెలలుగా రాకపోవడం. కమిషన్ డబ్బులు, రేషన్ పంపిణీ బ్యాగులు, ఇతర బిల్లులు చెల్లించకపోవడంతో రేషన్ డీలర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుకాణాల అద్దెలు, సిబ్బంది జీతాలు అన్నీ అప్పులు చేసి భరించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో రేషన్ షాపులు బంద్ చేసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని డీలర్లు నిర్ణయించారు.
రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలకు ఉచిత బియ్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంది. కానీ డీలర్ల బకాయిల విషయంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది అని విమర్శించారు. ఆగస్టు 31లోగా బకాయిలు చెల్లించకపోతే ధర్నాలు ప్రారంభిస్తామని హెచ్చరించారు.
ఆందోళన షెడ్యూల్:
సెప్టెంబర్ 2న ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నా
సెప్టెంబర్ 3న కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా
సెప్టెంబర్ 4న హైదరాబాద్ అసెంబ్లీ వద్ద ధర్నా
డీలర్ల డిమాండ్లలో భాగంగా
ప్రతీ నెల గౌరవ వేతనం రూ.5,000 ఇవ్వాలి
ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.140గా ఉన్న కమిషన్‌ను రూ.300కు పెంచాలి
రేషన్ షాపులను కేవలం బియ్యం పంపిణీ కేంద్రాలుగా కాకుండా మినీ సూపర్ మార్కెట్‌లుగా గుర్తించి నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తేవాలి
ప్రస్తుతం రేషన్ డీలర్లకు ప్రతి నెలా సుమారు రూ.25 కోట్ల కమిషన్ బకాయిలు ఉండగా, ఐదు నెలల్లో అది రూ.125 కోట్లకు చేరిందని సంఘం స్పష్టం చేసింది.