తెలంగాణలో మద్యం షాపుల లైసెన్స్ గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మద్యం దుకాణాల కోసం టెండర్లను ఆహ్వానిస్తూ, దరఖాస్తు ఫీజును కూడా పెంచుతున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఇకపై జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులు వసూలు చేయనున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 2620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి లైసెన్స్‌లు ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనున్నాయి. దీంతో ఎక్సైజ్ శాఖ ముందుగానే కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో కొత్త లైసెన్స్‌లకు సంబంధించిన నిబంధనలను ఖరారు చేసింది.
రానున్న టెండర్లలో లైసెన్స్ పొందిన వారికి డిసెంబర్ 1, 2025 నుంచి నవంబర్ 10, 2027 వరకు లైసెన్స్ గడువు ఉంటుంది. అలాగే దరఖాస్తు ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.
లైసెన్స్ ఫీజు వివరాలు (జనాభా ఆధారంగా):
5 వేల వరకు జనాభా: రూ.50 లక్షలు
5 వేల – 50 వేల జనాభా: రూ.55 లక్షలు
50 వేల – 1 లక్ష జనాభా: రూ.60 లక్షలు
1 లక్ష – 5 లక్షల జనాభా: రూ.65 లక్షలు
5 లక్షల – 20 లక్షల జనాభా: రూ.85 లక్షలు
20 లక్షలకు పైగా జనాభా: రూ.1.10 కోట్లు
రిజర్వేషన్ వివరాలు:
మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.
గౌడ కులస్తులకు – 15%
ఎస్సీలకు – 10%
ఎస్టీలకు – 5%
అదేవిధంగా భాగస్వామ్య సంస్థలు, కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకే దరఖాస్తుదారు అనేక దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. లైసెన్స్ కేటాయింపులు వార్షిక ఎక్సైజ్ పన్ను ఆధారంగా లాటరీ ద్వారా జరగనున్నాయి.
లాటరీలో దుకాణం పొందినవారు వార్షిక లైసెన్స్ రుసుమును ఆరు వాయిదాల్లో చెల్లించాలి. అదనంగా, 25 నెలల లైసెన్స్ గడువు కోసం 25% విలువైన బ్యాంక్ గ్యారెంటీ ప్రభుత్వానికి సమర్పించాలి.
షాపుల పని వేళలు:
జీహెచ్‌ఎంసీ, నగర పంచాయతీలు: ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు
గ్రామీణ ప్రాంతాలు: ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు
ఈ కొత్త మార్గదర్శకాలతో రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపులు జరగనున్నాయి.