తెలంగాణలో కొత్త మద్యం పాలసీ.. ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా బీర్ అమ్మకాలు!

తెలంగాణ ప్రభుత్వం నూతన మద్యం పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా బీర్ లవర్స్‌కి ఇది గుడ్ న్యూస్‌గా మారింది. కొత్తగా మైక్రో బ్రూవరీ పాలసీని ప్రవేశపెట్టింది. ఇకపై ఆసక్తి ఉన్న వారు స్వయంగా బీర్ తయారు చేసుకుని విక్రయించవచ్చు.

దీని కోసం 1000 గజాల స్థలం ఉంటే సరిపోతుంది. మైక్రో బ్రూవరీ ఏర్పాటు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎక్సైజ్ శాఖ పరిశీలన అనంతరం అనుమతులు మంజూరు చేయనుంది. దీంతో ఇకపై వైన్స్ షాపులు మాత్రమే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, పర్యాటక ప్రదేశాల్లో కూడా బీర్ దొరకనుంది.

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 18 మైక్రో బ్రూవరీలు ఉన్నాయి. అయితే తాజాగా వచ్చిన ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఈ సదుపాయాన్ని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా విస్తరించనున్నారు. కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు TCUR పరిధిలోని GHMC, బోడుప్పల్, జవహర్ నగర్, పీర్జాదిగూడ, బండ్లగూడ జాగీర్, నిజాంపేట్, మీర్ పేట్ ప్రాంతాల్లో కూడా దరఖాస్తులను ఆమోదించనున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఎన్ని దరఖాస్తులు వచ్చినా అన్ని అనుమతులు ఇవ్వబడతాయని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.

ప్రతిపక్షం ఆగ్రహం

అయితే ఈ కొత్త పాలసీపై ప్రతిపక్షం తీవ్రంగా విమర్శిస్తోంది. మాజీ ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ – “కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ తెస్తుందని అనగానే మద్య నిషేధం వైపు అడుగులు వేస్తుందని అనుకున్నాం. కానీ ఊరికో కంపెనీ పెట్టి అందరికి బీర్ తాగించేలా చేస్తుందని ఊహించలేదు. యువతను మద్యం మత్తులోకి నెట్టేలా ఈ పాలసీ ఉందని” అన్నారు. అలాగే బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని చెప్పి మరింత పెంచుతున్నారని ఆరోపించారు. ఆదాయం పెంచుకునే పేరిట విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. మైక్రో బ్రూవరీల ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply