గతంలో కుల ధృవీకరణ పత్రాలు (Caste Certificate) పొందాలంటే ప్రతి దరఖాస్తుకు తహశీల్దార్ ఆమోదం తప్పనిసరిగా అవసరం అవుతుండేది. అయితే ఇప్పుడు ‘మీ సేవ’ (Mee Seva) కొత్త ప్రక్రియ ద్వారా ఈ సర్టిఫికేట్లను సులభంగా పొందేలా చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులు నేరుగా మీ సేవ కేంద్రాల్లోనే కుల ధృవీకరణ పత్రాలు పొందవచ్చు.
గతంలో తహశీల్దార్ అవసరంగా ఉండటంతో సర్టిఫికేట్ పొందడంలో ఆలస్యం అవుతుండేది. దీన్ని నివారించేందుకు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు, మీసేవ విభాగం స్పెషల్ ఫోకస్ పెట్టింది.
ప్రక్రియలో మార్పులు:
CCLA, ఎస్సీ సంక్షేమ, జిల్లా అడ్మినిస్ట్రేటివ్, బీసీ సంక్షేమ అధికారులు, మరియు తహశీల్దార్‌లతో పలు సమావేశాల అనంతరం తాజా మార్పులు అమలు చేశారు.
ఈ కొత్త విధానం 15 రోజుల క్రితం ప్రారంభమైంది. ఇప్పటికే 17,571 మంది దరఖాస్తుదారులు సులభంగా సర్టిఫికేట్ పొందారు.
ప్రతి సంవత్సరం సుమారు 20 లక్షల మంది కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేస్తున్నారు.
కొత్తగా జారీ చేసే సర్టిఫికేట్లలో గత ఆమోదం చేసిన అధికారి వివరాలు, తిరిగి జారీ చేసిన తేదీలు కూడా ఉంటాయి.
ప్రత్యేక కేసులు:
హిందూ ఎస్సీ నుంచి క్రైస్తవ ధర్మంలో మారిన సందర్భాల్లో, దరఖాస్తు గత ప్రక్రియ ప్రకారం ఆమోదానికి పంపబడుతుంది (జీవో ఎంఎస్ నం.3, తేదీ 9.9.2020).
పాత సర్టిఫికేట్ నెంబర్ తెలిసినట్లయితే, మీసేవ కౌంటర్‌లో ఆ నెంబర్ ద్వారా కొత్త ప్రింట్‌అవుట్ పొందవచ్చు.
నెంబర్ తెలియకుంటే, మీసేవ సిబ్బంది జిల్లా, మండలం, గ్రామం, ఉపకులం, పేరు ఆధారంగా పరిశీలన చేసి సర్టిఫికేట్ ఇస్తారు.
మరిన్ని వివరాల కోసం మీసేవ వెబ్‌సైట్ లేదా సమీప మీ సేవ కేంద్రం ను సంప్రదించవచ్చు.