తెలంగాణలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ తలుపుతట్టేలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో లిక్కర్ ధరలు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే బీర్ల ధరలను 15 శాతం పెంచిన ప్రభుత్వం.. ఇప్పుడు హై-ఎండ్ లిక్కర్ బ్రాండ్స్ పై ధరలు పెంచే యోచనలో ఉంది. అయితే ఎక్కువమంది తాగే చీప్ లిక్కర్ బ్రాండ్స్ కు మాత్రం మినహాయింపు ఇచ్చే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ప్రస్తుతం బాటిల్ ధర రూ.500 కంటే ఎక్కువ ఉన్న లిక్కర్‌లపై కనీసం 10 శాతం ధర పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. అంటే రూ.500 ధర ఉన్న బాటిల్‌పై రూ.50 వరకు పెరుగే ఛాన్స్ ఉంది. ఈ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.2000 కోట్ల వరకూ అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు రెండు లేదా మూడు రకాల ధరల పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేసి, త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఆయా ప్రతిపాదనల్లో ఏ విధానంలో ఎంత ఆదాయం వస్తుందో స్పష్టంగా వివరించనున్నారు. తరువాత ప్రభుత్వం సమీక్షించిన తర్వాత ఫైనల్ నిర్ణయం తీసుకోనుంది.
ఇక ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో బీర్ల ధరలను రాష్ట్ర ప్రభుత్వం సగటున రూ.20–₹30 పెంచిన సంగతి తెలిసిందే. ముడి సరుకుల ధరలు పెరగడంతో పాటు పక్క రాష్ట్రాల్లో లిక్కర్ రేట్లతో పోలిస్తే తెలంగాణలో తక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ, లిక్కర్ రేట్లను కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బడుగు, మధ్య తరగతి ప్రజలపై భారం పడకుండా చూడాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.