తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాల సూచనతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాల్లో ఇవాళ (ఆగస్టు 13), రేపు (ఆగస్టు 14) స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఈ రెండు సెలవులకు తోడు 15న స్వాతంత్ర్య దినోత్సవం, 16న కృష్ణాష్టమి, 17న ఆదివారం ఉండటంతో మొత్తం ఐదు రోజుల పాటు ఈ జిల్లాల విద్యార్థులకు వరుస సెలవులు వస్తున్నాయి.
హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున, ఒకపూట మాత్రమే స్కూళ్లు నడపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో ఆగస్టు 13, 14వ తేదీల్లో హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు
జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సగం రోజు సెలవు ప్రకటించిన విద్యా శాఖ pic.twitter.com/NdF0z9XCxx
— dktimestelugu (@dktimestelugu) August 13, 2025
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజులలో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మేడ్చల్, సైబరాబాద్ పరిధిలో 10-15 సెం.మీ., కొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించారు. లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, వాగులు, వంకలు, నదుల వైపు వెళ్లరాదని హెచ్చరించారు. రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్ హైడ్రా కమిషనర్ కూడా ఉత్తర హైదరాబాద్, మేడ్చల్, సైబరాబాద్ పరిధిలో భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు. రోడ్లు జలమయం అయ్యే అవకాశం ఉండటంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీ ఉద్యోగులు వీలైనంత త్వరగా ఇళ్లకు వెళ్లాలని లేదా వర్క్ ఫ్రం హోమ్ (WFH) చేయాలని సూచించారు. వాహనదారులు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.