తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రజలకు ఇబ్బంది లేకుండా సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం, సీఎంవో అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు.

భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, చెరువులు, కుంటలు నిండిపోవడం వల్ల వరద నీటి ఉదృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

కలెక్టర్లకు ప్రత్యేక సూచనలు

వర్ష సూచన ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు ప్రతి విభాగంతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

జిల్లాల్లో అధికారులు అందుబాటులో ఉండాలి

వర్షాలు, వరదలతో ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలని రేవంత్ ఆదేశించారు. అలాగే ఉన్నతాధికారులు కలెక్టర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి నివేదిక ఇవ్వాలని సూచించారు.

Leave a Reply