తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గురువారం (ఆగస్టు 28) ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఈ పర్యటనలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటున్నారు.
ఇక అంతకుముందు, జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, సీఎస్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేసి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను రక్షించడంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలతో పలు జిల్లాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద చేరడంతో ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. వాగులు, నదులు పొంగిపోర్లుతుండటంతో రహదారులపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బస్సు, రైలు సర్వీసులు కూడా రద్దయ్యాయి.
ఉత్తర తెలంగాణ జిల్లాలైన…
పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ లలో
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో…
ఏరియల్ సర్వే నిర్వహించి…
పరిస్థితిని పరిశీలించాను.నాతో పాటు
భారీ నీటి పారుదల శాఖ మంత్రి
శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి,
పీసీసీ అధ్యక్షుడు
శ్రీ మహేష్ కుమార్ గౌడ్
పాల్గొన్నారు.… pic.twitter.com/Z2wwrXvkVW— Revanth Reddy (@revanth_anumula) August 28, 2025
సీఎస్ కె. రామకృష్ణారావు టెలీకాన్ఫరెన్స్ ద్వారా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పరిస్థితిని సమీక్షించారు. ముంపు గ్రామాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, విద్యుత్ సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని ఆయన ఆదేశించారు.
ప్రత్యేకంగా మెదక్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. హావేలిఘనాపూర్ మండలం సర్దనలో 30.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నాగపూర్, చేగుంట, రామాయంపేట మండలాల్లో కూడా రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దీంతో బోధన్, బాన్స్‌వాడ వైపు బస్సు సర్వీసులు నిలిపివేశారు. పలు కాలనీలు నీట మునిగిపోగా, ప్రజలను అధికారులు రక్షిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మెదక్, కామారెడ్డి, సిరిసిల్లా, నిజామాబాద్ జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి, వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. అనంతరం స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించి, అవసరమైన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమస్య ఉంటే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సీఎం సూచించారు.