Revanth Reddy: ఒక్క జీవోతో 6,729 ఉద్యోగాలకు గుడ్‌బై.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకే జీవో ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు విధానంలో కొనసాగుతున్న 6,729 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం ప్రస్తుతం అధికార వర్గాల్లో, ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ ఉత్తర్వుల ప్రభావం పదవీ విరమణ అనంతరం కాంట్రాక్టు విధానంలో కొనసాగుతున్న ఉద్యోగులపై పడింది. అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ స్థాయి వరకు ఉన్న పలువురు కీలక అధికారులు ఈ జాబితాలో ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్‌ జి.కిషన్‌రావు, కన్సల్టెంట్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌ రెడ్డి, 10 మంది ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్లు సహా అనేక మంది కీలక హోదాల్లో కొనసాగుతున్న అధికారులు తొలగింపుకు గురయ్యారు.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం స్పష్టం చేసిన ప్రకారం, ఈ నెలాఖరుకల్లా ఈ ఉద్యోగుల సేవలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే, అవసరమైన వారిని తిరిగి నియమించుకునేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయొచ్చని పేర్కొంది.

ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ పరిపాలనలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ శాఖ, రెవెన్యూ, విద్యుత్తు, రవాణా, దేవాదాయ, ఆర్ అండ్ బీ, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల్లో కీలక స్థాయిలో మార్పులు జరగబోతున్నాయి. ఇప్పటికే ఇరిగేషన్ శాఖలో 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన ప్రభుత్వం, పోలీసు శాఖలోనూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రాగానే అక్కడ కూడా భారీ మార్పులు చేపట్టింది.

ఈ తాజా నిర్ణయం ద్వారా కొత్తగా గ్రూప్ -1 నుంచి గ్రూప్ – 4 వరకు ఉద్యోగాల భర్తీకి కొత్త అవకాశాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. పలు శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో కొత్త నోటిఫికేషన్లు విడుదల అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక, గత కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ ప్రభుత్వ వ్యవస్థలో కీలకంగా పనిచేస్తూ వచ్చిన అనేక మంది అధికారులను ఇంటికి పంపించడం, ఒకవైపు కొత్త ఉద్యోగాల కోసం మార్గం సుగమం చేయడం.. ఈ రెండు అంశాలు కలిసి రేవంత్ రెడ్డి పాలనలో పెద్ద పరిపాలనా సంస్కరణగా మారబోతున్నాయి.

ప్రభుత్వ పరిపాలన మరింత పారదర్శకంగా, సమర్థంగా ఉండేలా తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో రాష్ట్ర పరిపాలనపై ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి కరంగా మారింది.

Leave a Reply