Fancy Numbers: ఫ్యాన్సీ నెంబర్లపై తెలంగాణ రవాణాశాఖ కీలక నిర్ణయం.. భారీగా పెరిగిన ఫీజులు!

తెలంగాణ రవాణాశాఖ ఫ్యాన్సీ నంబర్లపై కొత్త నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న ధరలను భారీగా పెంచుతూ ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. గతంలో రూ.50 వేలు ఉన్న కొన్ని ఫ్యాన్సీ నెంబర్ల ధర ఇప్పుడు ఏకంగా రూ.1.50 లక్షలకు పెరిగింది.

కొత్తగా వాహనాలు కొనేవారు తమ వాహనాలకు ప్రత్యేక నంబరు ఉండాలని కోరుకుంటారు. జాతకం, అదృష్టం, లేదా ప్రత్యేకత కోసం చాలా మంది ఫ్యాన్సీ నంబర్లపై ఎక్కువ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి వాహనదారులకు ఇప్పుడు భారీ షాక్ ఇచ్చింది రవాణాశాఖ.

ఇప్పటి వరకు ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు ఐదు స్లాబులుగా ఉండగా.. వాటిని ఇప్పుడు ఏడుకు పెంచారు.

రూ.50 వేల నంబరు – ఇప్పుడు రూ.1.50 లక్షలు

రూ.40 వేల నంబరు – ఇప్పుడు రూ.1 లక్ష

రూ.30 వేల నంబరు – ఇప్పుడు రూ.50 వేల రూపాయలు

రూ.20 వేల నంబరు – ఇప్పుడు రూ.40 వేల రూపాయలు

రూ.10 వేల నంబరు – ఇప్పుడు రూ.30 వేల రూపాయలు

రూ.5 వేల నంబరు – ఇప్పుడు రూ.6 వేల రూపాయలు

ఇక 1, 9, 6666, 9999, 8055 లాంటి అత్యంత డిమాండ్‌లో ఉండే నంబర్ల ధరలు కూడా పెరిగాయి.

ఉదాహరణకు – 9999 నంబరు ఇప్పటి వరకు రూ.50 వేల ప్రాథమిక ధర కలిగి ఉండగా, ఇకపై రూ.1.50 లక్షలుగా నిర్ణయించారు. 6666 నంబరు ధర రూ.30 వేల నుంచి రూ.70 వేలకి పెరిగింది.

ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా రవాణాశాఖకు ప్రతి సంవత్సరం సుమారు రూ.100 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఇప్పుడు ధరలు పెరగడంతో ఈ ఆదాయం మరింత పెరగనుంది. అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన తర్వాత త్వరలోనే పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.

Leave a Reply